ఏపీ నుండి తెలంగాణాలో ప్రవేశించే వాహనాలపై ప్రవేశపన్ను విధించవద్దని, దాని వలన తెలంగాణా నుండి ఏపీలోకి ప్రవేశించే వాహనాలపై కూడా విధిస్తే ఆ భారం తాము మోయలేమని రెండు రాష్ట్రాలకు చెందిన వాహన యజమానులు, ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఎంత బ్రతిమాలినా తెలంగాణా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోలేదు. దేశంలో మిగిలిన రాష్ట్రాల లాగే తెలంగాణా కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందున ప్రవేశ పన్ను వసూలు చేసుకోవడం తమ హక్కు అని ఆంధ్రా నుండి టెల్ రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై ప్రవేశ పన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. ఊహించినట్లే అప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణా నుండి ఆంద్రప్రదేశ్ లోకి ప్రవేశించే వాహనాలపై ప్రవేశ పన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. దాని వల్ల రెండు ప్రభుత్వాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగింది. కానీ సరుకు రవాణా, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు రెండు రాష్ట్రాలలో పన్ను చెల్లించవలసి రావడంతో వారు ఆ భారాన్ని ప్రజల మీదనే మోపుతున్నారు. దానితో ఆంద్రప్రదేశ్-తెలంగాణా మధ్య నిత్యం తిరుగుతున్న బస్సుల టికెట్ల ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య సుమారు 10,000 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నట్లు ఒక అంచనా. కనుక వారిపైనే ఎక్కువ భారం పడుతోంది.
కానీ ఆంధ్రా నుండి తెలంగాణాలోకి వచ్చే టూరిస్ట్ వాహనాల కంటే తెలంగాణా నుండి ఏపీలో వివిద సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకి, తిరుపతి, అన్నవరం, సింహాచలం, అరసవిల్లి వంటి పుణ్యక్షేత్రాలకు వెళుతున్న బస్సులే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ డబుల్ ఎంట్రీ టాక్స్ విధానం వలన తెలంగాణా రాష్ట్రానికే ఎక్కువ నష్టం జరుగుతున్నట్లు తెలంగాణా రవాణా శాఖ గుర్తించింది. కనుక తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబుల్ ఎంట్రీ టాక్స్ పై పునరాలోచనలో పడినట్లు తాజా సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఈ డబుల్ ఎంట్రీ టాక్స్ నుండి మినహాయింపు ఇచ్చి దాని స్థానంలో మళ్ళీ ఇదివరకు లాగే సింగల్ ఎంట్రీ టాక్స్ విధానం అమలు చేయడానికి తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తాజా సమాచారం. ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరిస్తే రెండు రాష్ట్రాల రవాణా శాఖలు కలిసి పర్మిట్ లను జారీ చేస్తాయి.
ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ కి దీనిని వర్తింపజేస్తే సరుకు రవాణా వాహన యజమానులు కూడా దీని కోసం పట్టు బట్టవచ్చును. ప్రభుత్వం అంగీకరిచకాపోతే కోర్టుకి వెళ్ళవచ్చును. కనుక వారికీ సింగిల్ ఎంట్రీ టాక్స్ విధానం అములుచేయవలసి రావచ్చును. క్రమంగా మళ్ళీ అన్ని వాహనాలకు వర్తింపజేయవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ తెలంగాణా ప్రభుత్వం తనకు నష్టం వస్తోంది కనుక మళ్ళీ పునరాలోచన చేస్తోంది. కానీ ఆంద్రప్రదేశ్ కి లాభం కలుగుతున్నప్పుడు తెలంగాణా ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరిస్తుందో లేదో తెలియదు. కానీ మిగిలిన అన్ని రకాల వాహనాలకి కూడా సింగిల్ ఎంట్రీ టాక్స్ విధానం అమలు చేయడానికి అంగీకరిస్తేనే ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తామని చెప్పే అవకాశం ఉంది.