కిందటి వారం జరిగిన రెండు రైలు ప్రమాదాలూ సామాన్యమైనవి కావు. పదుల సంఖ్యలో ప్రాణాలను హరించాయి. అందుకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ రాజీనామా సమర్పించారు. కొద్ది గంటలకే రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా నైతిక బాధ్యత వహిస్తానంటూ ప్రధాన మంత్రిని కలిశారు. అంటే రాజీనామా చేసేశారని మీడియా అంతా కోడై కూసింది. ఇంతకీ ప్రధాని స్పందన చాలా ఆసక్తికరంగా ఉంది. తొందరపడకండి.. వేచి చూడండి అన్నారని సురేష్ ప్రభే స్వయంగా తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ రాజీనామాను తక్షణం ఆమోదించినప్పుడు మంత్రిది ఎందుకు తిరస్కరించారనేది ఇక్కడి ప్రశ్న. ఇదేమీ లాల్ బహదూర్ శాస్త్రి గారి నాటి కాలం కాదు. పాపం ఆ రోజుల్లో అంటే 1956 నవంబర్ 26న అరియలూర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. వార్త విన్న తక్షణం శాస్త్రి ఆలస్యం చేయకుండా ప్రధాని నెహ్రూకు రాజీనామా చేస్తానని తెలిపారు. పార్లమెంటులో మరుసటి రోజున నెహ్రూ ఒక ప్రకటన చేశారు.
శాస్త్రి రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తున్నాననేది దాని సారాంశం. ఇప్పుడసలు రాజీనామాకు ముందుకొచ్చే మంత్రులే తక్కువ. బీహార్‌లో లాలూ తనయుడి నిర్వాకమే దీనికి తాజా ఉదాహరణ. ప్రభుత్వం పడిపోతుందన్నప్పటికీ బిగదీసుక్కూర్చున్నాడు. ఫలితం లాలూ పార్టీని ప్రభుత్వం నుంచి గెంటేయడానికి నితీశ్ కుమార్ ఏకంగా మహాఘట బంధన్నే వదిలించేసుకున్నారు.
ఇప్పుడు, నేను రాజీనామా చేసేస్తాను మొర్రో అంటే తొందరపడొద్దంటున్నారు ప్రధాని. కారణం.. ఇప్పటికే ఆయనకు ఉద్వాసన పలకడానికి నిర్ణయించేసుకుని ఉండటం కావచ్చు. తాజాగా నితీశ్ కుమార్, పళని+పన్నీర్ బ్యాచ్‌కు కేంద్రంలో పెద్ద పీట వేయాల్సి ఉంది. ఆ తరుణంలో ఎలాగూ కొంతమందిని వదిలించేసుకోవాలి. ఆ లిస్టులో ప్రభు ఉండుడచ్చు.
ఈలోగా ఈ రైలు ప్రమాదాలు జరిగిపోయాయి. బ్యాడ్‌లక్. తీసేయకుండానే తప్పుకుందామనుకున్న ప్రభు కార్యం సఫలం కాలేదు. అసలు రైల్వే బడ్జెట్ తీసేసినప్పుడే ఆయన తప్పుకుని ఉండాల్సింది. ఉండు నేనే తీసేస్తానన్నట్లు వేచి ఉండన్నారు ప్రధాని. క్యాబినెట్ విస్తరణలో ఎలాగూ తీసేస్తారు కాబట్టి ప్రధాని ఇప్పుడొద్దులే అనుండచ్చు. పైగా ఈయన ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రత్యేక రైల్వే జోన్ గొడవ ఎలాగూ ఉండనే ఉంది. ఏపీకి ఏదైనా ప్రయోజనం కలిగే పని చేయాలంటే తన చేతికి మట్టంటకుండా వ్యవహరించడం కేంద్రానికి అలవాటు. పోలవరం ప్రాజెక్టు దీనికి ఉదాహరణ. ఇప్పుడీయన్ని రాజీనామా చేయించేస్తే.. రైల్వే జోన్ సమస్య ఎవరిమీదికి తోసేయ్యాలి? మరో కొత్త మంత్రివర్యుడు కావాలి. అందుకే ఆ అంశానికి మంత్రివర్గ విస్తరణలోగా ముగింపు పలికే అవకాశముందేమో ప్రధాని పరిశీలిస్తున్నారేమో కూడా స్పష్టం కావాల్సుంది.
-సుమ