భారత అత్యున్నత న్యాయస్థానం వ్యక్తిగత గోప్యత పౌరుడి ప్రాథమిక హక్కని చాటి చెప్పింది. తొమ్మిదిమంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈమేరకు తీర్పు చెప్పింది. తీర్పుపై న్యాయమూర్తులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ తీర్పు కేంద్రానికి చెంపపెట్టులాంటిదే. రాజ్యాంగం వ్యక్తిగత గోప్యతకు భరోసా ఇవ్వదనీ, అది ప్రాథమిక హక్కు కిందకు రాదనీ కేంద్రం వాదించింది. రాజ్యాంగంలోని మూడో విభాగంలోని స్వేచ్ఛకు పూచి ఇచ్చిందని తీర్పు పేర్కొంది. ఆర్టికిల్ 21 ప్రకారం గోప్యత హక్కు వ్యక్తిగత స్వేచ్ఛల స్వాభావికంగా దఖలు పడ్డాయని తీర్పు వివరించింది. అన్ని లావాదేవీలకూ ఆధార్ నెంబరును పేర్కొనడం తప్పని సరంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను విచారించిన ధర్మాసనం సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది. ఆధార్ సమాచారంతో వందకోట్ల మంది ఐరిస్ స్కాన్లు, వేలి ముద్రలు ఇమిడిఉన్నాయి. అన్ని ఆర్థిక లావాదేవీలకూ ఆధార్ నెంబరును పేర్కొనాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై ప్రస్తుత తీర్పులో ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందా లేదా అనే అంశంపైనా కూడా ధర్మాసనం వ్యాఖ్యానించలేదు. ఆ నిర్ణయాన్ని మరో ప్రత్యేక, తక్కువమందితో కూడిన ధర్మాసనం తీసుకుంటుంది. కానీ ప్రస్తుత తీర్పు ప్రభుత్వం తన వాదనను మార్చుకునేలా చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని ప్రాథమిక హక్కులకూ సముచితమైన నియమాలూ ఉన్నాయని ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. ఆధార్‌కు అలాంటి నియమాలను వర్తింపజేస్తారా అనేది నిర్ణయించాల్సుందన్నారు. అవినీతిని అణిచేయాలంటే ఆధార్‌ను వజ్రాయుధంగా చేసుకోవాలనుకుంటున్న కేంద్రానికి ఈ తీర్పు అడ్డే. ఆర్థిక లావాదేవీలన్నీ ఆధార్ ఆధారంగా సాగితే పారదర్శకత పెరిగి, అవినీతి తగ్గుతుందన్నది కేంద్రం యోచన. అవినీతికీ-ఆధార్‌కు మధ్య జరుగుతున్న ఈ సమరంలో అంతిమ విజేతలెవరో తేలడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది.
-సుమ