నంద్యాల ఉప ఎన్నిక పలితంపై ముందునుంచి రకరకాల జోస్యాలు వినిపిస్తున్నాయి. మొత్తంపైన పాలకపక్షం గెలవచ్చని చెప్పేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. లగడపాటి ఆధ్వర్యంలోని ఆర్జి ప్లాష్ సర్వే యాభై శాతం పైగా ఓట్లు వస్తాయని ముందే చెప్పింది. పాలకపక్షం నాయకులు కూడా అదే ఆశలో వున్నారు. అయితే వారు చెప్పే మెజార్టి అంచనా మాత్రం అతిశయోక్తిగా వుందన్నది నిజం. హౌరాహౌరీగా పోరాడిన మాట నిజమే గాని ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే వచ్చే ఎన్నికల నాటికి పనులూ పూర్తవుతాయనే భావన ఓటర్లలో బలంగానే వుంది. ఇందుకు భిన్నంగా రాజకీయంగా ప్రజలు కృతనిశ్చయంతో ఓటేసి వుంటే తప్ప వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన రెడ్డి గెలిచే అవకాశాలు వుండవు. పైగా ఆయన గతంలో మంత్రిగా చేసిన వారు కావడంతో తన పట్ల కూడా వ్యతిరేక భావాలు వుండొచ్చు. గతసారి వైసీపీ తరపున భూమా నాగిరెడ్డి స్వల్ప మెజార్టితో గెలవడానికి శోభానాగిరెడ్డి దుర్మరణం వల్ల కలిగిన సానుభూతి ఒక కారణమని పరిశీలకులు అంటున్నారు. నిజానికి నిన్ననే చాలా మంది ఓటర్ల మూడ్ మారింది గనక వైసీపీకి విజయావకాశాలు పెరిగాయని చెప్పడం మొదలు పెట్టారు. ఒకటి రెండు రోజుల్లో అంత మార్పు రావడానికి అవకాశమేముంటుంది? యువత ఓటింగు శాతం వుండాల్సినంత ఎక్కువగా లేదు. మైనార్టిలు అంటే ముస్లింలు బాహాటంగానే మేము టిడిపికి వేస్తామని చెప్పారని కాంగ్రెస్ నాయకులొకరు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే టిడిపి గట్టెక్కే అవకాశం అధికమనే చెప్పాలి. నిన్నటికి నిన్న పోలింగ్ రోజున భారీగా ఆ పార్టీకి ఓటు వేసి వుంటే మాత్రం చెప్పలేము.అయితే అలా అనుకోవడానికి ఆధారాలేమీ లేవు. కాంగ్రెస్ నాయకులు గతంలో వచ్చిన 2500 ఓట్లు తమకు వస్తాయని అంటున్నారు. కాబట్టి వారి పోటీ కూడా పెద్ద ప్రభావం చూపకపోవచ్చు.