తెలంగాణ ఏర్పాటు జరగబోతున్న దశ వరకూ టిఆర్ఎస్ అధినేత కాంగ్రెస్లో విలీనానికి తలుపులు తెరిచే వుంచారన్న సంగతి అందరికీ తెలుసు. అవసరమైతే విలీనం చేయడానికి మీరంతా సిద్దంగా వుండాలని డిల్లీలో ముఖ్యనేతలను సమావేశపర్చి చెప్పారు కూడా. సకుటుంబంగా సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వచ్చారు. తర్వాత మాత్రం విలీనం జరగలేదు సరికదా ఆ రెండు పార్టీలో ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల పోరాటం జరిగింది. మరి తేడా ఎక్కడ వచ్చింది? కెసిఆర్ తనను ముఖ్యమంత్రిని చేస్తేనే టిఆర్ఎస్ను విలీనం చేస్తానని షరతు పెట్టారని దానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదని ఒక కథనం విస్త్రతంగా ప్రచారంలో వుంది. కాంగ్రెస్ నాయకులూ అదే చెబుతుంటారు. అయితే ఆయన అడిగింది పిసిసి అద్యక్ష పదవి తప్ప ముఖ్యమంత్రి స్థానం కాదట. ఇది టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వి.ప్రకాశ్ అంటున్న మాట. నన్ను నమ్ముకున్న వారికి టికెట్లు రావాలన్నా నాకు సంస్థాగతంగా పట్టు వుండాలి గనక పిసిసి అద్యక్షుణ్ని చేస్తామని మాట ఇవ్వండి అని ఆయన అడిగారట. దానికి అప్పటి పరిశీలకుడు దిగ్విజరు సింగ్ తిరస్కరించడంతో అవగాహన కుదరలేదని ప్రకాశ్ ఒక ఇంటర్వ్యూలో నాతో చెప్పారు.దీనికి డిగ్గీ రాజానే బాధ్యుడని టిఆర్ఎస్ నేతలంటుంటారు గాని అధిష్టానం అనుమతి లేకుండా అక్కడ జరిగేదేమీ వుండదని అందరికీ తెలుసు. పైగా పిసిసి అద్యక్షుడి పదవిఇస్తే తమ పార్టీని ఆయనకు అప్పగించినట్టు అవుతుందని కాంగ్రెస్ నేతలు అనుకుని వుండొచ్చు. ఏమైతేనేం- దాంతో కథ మారింది.