మనకున్న హీరోల్లో కల్యాణ్ రామ్ కాస్త డిఫరెంట్. హిట్టున్నా, పరాజయాలు వస్తున్నా దాదాపుగా సొంత బ్యానర్లోనే సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తుంటాడు. అదేంటని అడిగితే.. ‘మన సినిమా కాబట్టి మనం కావల్సినంత ఖర్చు పెట్టుకోవొచ్చు. మార్కెట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని నిక్కచ్చిగా చెప్పేస్తుంటాడు. దానికి తగ్గట్టు తన సినిమాలు అన్నీ క్వాలిటీ పరంగా బాగుంటాయి. కాకపోతే ఒకటే సమస్య. పేరున్న హీరోయిన్లే కనిపించరు. తొలి సినిమా నుంచి మొన్నటి షేర్ వరకూ.. దాదాపుగా అన్ని సినిమాల్లోనూ కొత్త హీరోయిన్లే. హీరోయిన్ ఎంపికలో పొరపాట్లు చాలా సినిమాల్లో కనిపించాయి. పటాస్ లాంటి సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండి ఉండుంటే దాని రేంజు వేరేలా ఉండేది.
దాంతో కల్యాణ్ రామ్ ఆలోచనా విధానంలో కాస్త మార్పు వచ్చేసింది. టికెట్టు తెగాలంటే కథలో దమ్ముతో పాటు, పోస్టరుపై అందమైన కథానాయిక ఉండాల్సిందే అన్న విషయం కల్యాణ్ రామ్‌కి ఇప్పుడు తెలిసొచ్చినట్టుంది. అందుకే.. స్టార్ హీరోయిన్ల వెంట పడుతున్నాడు. ఎం.ఎల్.ఏ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కాజల్ నటిస్తోంది. ఇది కాక.. జయేంద్ర అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు కల్యాణ్‌రామ్. ఈ సినిమా కోసం తమన్నాని తీసుకొచ్చారు. ముందు అలవాటు ప్రకారం ఓ కొత్తమ్మాయిని తీసుకొన్నారు. కానీ.. బిజినెస్ లెక్కల గురించి ఆలోచించారేమో.. సడన్‌గా తమన్నా ఎంట్రీ ఇచ్చేసింది. ఇదంతా కల్యాణ్ రామ్ `బిజినెస్` మైండ్‌లో వచ్చిన మార్పే. ఈ రెండు సినిమాలూ సక్సెస్ అయితే… భవిష్యత్తులోనూ స్టార్ హీరోయిన్లతోనే కల్యాణ్ రామ్ ప్రయాణం చేయొచ్చు.