కాకినాడ కార్పొరేషన్ ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారానికి వచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ఏకరవు పెట్టారు. రాష్ట్రంలో మూడు పట్టణాలకు స్మార్ట్ సిటీ ఇచ్చే అవకాశం ఉందని కేంద్రం చెబితే… హుద్ హుద్ తుఫానుతో అతలాకుతలమైన విశాఖను, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని ఎంపిక చేశామన్నారు. మూడో స్మార్ట్ సిటీ కాకినాడ ఉండాలని తాను పట్టుబట్టానని చెప్పారు. కాకినాడకు ఎంతో భవిష్యత్తు ఉందనీ, అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపాకి ఓటు వేస్తే వారు అభివృద్ధికి అడ్డుపడతారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ముందు నుంచీ ప్రతిపక్ష నేత జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఈ సందర్భంగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామనీ, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేర్చుకుని వస్తున్నామన్నారు. ఇన్ని చేస్తున్న తనను రోడ్డుపై కాల్చేయాలనీ, ఉరితీయాలనీ ప్రతిపక్ష నేత విమర్శించడం ఎంతవరకూ సబబు అనేది ప్రజలే ఆలోచించాలన్నారు. ఇలాంటి భాష మన పిల్లలు వినడానికి బాగుంటుందా, పిల్లలకు నేర్పించాల్సిన భాష ఇదేనా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఇలాంటివారు మనకు అక్కర్లేదన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించిందనీ, కేసు కూడా నమోదు చేయమన్నారని చంద్రబాబు చెప్పారు. నంద్యాలను మరో పులివెందుల చేస్తామంటూ విపక్ష నేత చెబితే, అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలిపారన్నారు. కాకినాడను కూడా మరో పులివెందుల చేస్తే మీరు ఊరుకుంటారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. అన్ని వార్డుల్లో మనమే పనులు చేసుకుంటున్నామనీ, ఇలాంటి పరిస్థితుల్లో విపక్షానికి ఓటేస్తే మురుగుపోతుందనీ, లేదంటే అభివృద్ధికి వారు అడ్డం పడుతూ ఉంటారని చంద్రబాబు చెప్పారు. ఏటీఎంలు దొంగలించేవారు రాజకీయ నాయకులా, ప్రభుత్వ భూములను కొట్టేసేవాళ్లు రాజకీయ నాయకులా అంటూ జగన్ పై ముఖ్యమంత్రి విమర్శలు చేశారు.
చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, కాస్త హద్దు మీరి ఉన్నాయనే చర్చ సామాన్య జనంలో కూడా జరగడం, ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నిక సంఘం స్పందించడం.. దీంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబుకు ఇదే ఓ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. నిజానికి, నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇంత ఘాటుగా చంద్రబాబు స్పందించలేదు. అక్కడ నిర్వహించిన రోడ్ షోలో పైపైనే ఈ టాపిక్ మాట్లాడారు. కానీ, కాకినాడలో ఈ అంశాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారనే చెప్పాలి! ఎన్నికల సంఘం చర్యలకు దిగడంతో ఈ అంశపై టీడీపీ స్పందన ఘాటెక్కిందని చెప్పొచ్చు.