భారత్ కు డబుల్ ధమాకా. సానియా మీర్జా, మార్టినా హింగిస్ ల జోడీ యు ఎస్ ఓపెన్ మహిళల విభాగంలో చాంపియన్ గా నిలిచింది. మరో టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీలో మార్టినా హింగిస్ లియాండర్ పేస్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఒకే టోర్నీలో ఇద్దరు భారతీయులతో జోడీ కట్టి రెండు టైటిల్స్ గెలిచిన హింగిస్ గెలిచిన మొత్తం గ్రాండ్ స్లాం టైటిల్స్ సంఖ్య 20కి చేరింది.
ఫైనల్ మ్యాచ్ లో సానియా, హింగిస్ జోడీ అద్భుతమైన సమన్వయంతో చెలరేగి ఆడింది. ప్రత్యర్థులకు పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా అలవోకగా విజయం సాధించింది. ఆస్ట్రేలియా, కజక్ స్తాన్ క్రీడాకారిణుల జోడీని 6-3, 6-3 స్కోరుతో వరుస సెట్లలో సునాయాసంగా ఓడించింది. 70 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది.
మొత్తానికి మన సానియా మీర్జా 5 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచినట్టయింది. ఇందులో మార్టినా హింగిస్ పాత్ర మరువ లేనిది. ఆమె లేకపోతే సానియా, పేస్ లకు ఇన్ని టైటిల్స్ దక్కేవే కావు. వీరిద్దరి పాలిట మార్టినా దేవత అంటే అతిశయోక్తి కాదంటున్నారు క్రీడా పండితులు. చక్కటి సమన్వయం, పరస్పర సహకారం, పోరాట స్ఫూర్తి, విజయ కాంక్ష, స్నేహపూర్వక వాతావరణంలో ప్రాక్టిస్ చేయడం వంటి లక్షణాల వల్ల మార్టినా మనవాళ్లకు సరైన జోడీ అయింది. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ జోడీ అంటే ఇలా ఉండాలనిపించేలా జోడీ కుదిరింది. మొత్తానికి సానియా మీర్జాకు యు ఎస్ ఓపెన్ లో అత్యద్భుతమైన విజయం సొంతమైంది. విజయగర్వంతో శంషాబాద్ లో అడుగు పెట్టబోతోంది.