సెల్యులాయిడ్ సైంటిస్ట్‌గా పేరు తెచ్చుకొన్నాడు నాగార్జున. తాను చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఓకొత్త కథనీ, కొత్త దర్శకుడ్నీ ప్రోత్సహించడంలో నాగ్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఓ కథానాయకుడిగానే కాదు, నిర్మాతగానూ నాగ్ తపన అదే. ప్రస్తుతం తన వారసుల కెరీర్‌ని గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు నాగ్. మరోవైపు `రాజుగారి గది 2`ని సిద్దం చేసే పనిలో పడ్డాడు. మంగళవారం నాగ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాగ్‌తో చేసిన చిట్ చాట్ ఇది..
* హాయ్ సార్..
– హాయ్
* పుట్టిన రోజు శుభాకాంక్షలు..
– థ్యాంక్యూ వెరీ మచ్..
* ఈ యేడాది బిజీ బిజీగా గడిపేస్తున్నట్టున్నారు..
– అవునండీ. ప్రొడ్యూసర్‌గా రెండు సినిమాలు చేశా. మరోవైపు నా `రాజుగారి గది 2` సిద్దం అవుతోంది. చైతూ పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. ప్రతీ రోజూ. ఏదో ఓ పనితో బిజీగా ఉంటున్నా… సందడి సందడిగా ఉంటోంది.
* రాజుగారి గది 2 విశేషాలేంటి?
– రాజుగారి గది కథకూ దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇదేం సీక్వెల్ కాదు. పూర్తిగా కొత్త కథ. కాకపోతే అదే జోనర్లో తీస్తున్న సినిమా కాబట్టి, ఆ పేరు వాడుకొన్నాం. సాధారణంగా నాకు హారర్ సినిమాలంటే ఇష్టం ఉండదు. చూసినా.. చెవులు మూసేసుకొంటా. కానీ రాజుగారి గది 2 చేశానంటే దానికి గల కారణం.. నా పాత్ర. ఎదుటివారితో పది నిమిషాలు మాట్లాడితే చాలు.. వాళ్లని పూర్తిగా చదివేస్తా. ఇలాంటి వ్యక్తులు నిజంగా ఉన్నారు. వాళ్లని కలిశా. వాళ్ల సలహాలు కూడా తీసుకొన్నా.
* సమంత పాత్ర ఎలా ఉండబోతోంది?
– తను ఆత్మగా కనిపించబోతోంది. మా ఇద్దరి పాత్రల్నీ ఓంకార్ చాలా బాగా డిజైన్ చేశాడు. మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు తను.
* అఖిల్ సినిమాకి `హలో` అని నామ కరణం చేసింది మీరే అని తెలిసింది..
– అవును. ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టాలో తెలీక… అందరూ బుర్ర బద్దలు కొట్టుకొన్నారు. `హలో` అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే రిజిస్టర్ చేయించేశా. హలో అనే పేరు సరదాగా పెట్టలేదు. ఈ కథకూ ఆ పదానికి సంబంధం ఉంది. అదేంటన్నది తెరపై చూస్తే బాగుంటుంది.
* ఈ సినిమా ఎలా ఉండబోతోంది?
– ఓ కొత్తరకమైన సినిమా ఇది. కథ, కథనాలు కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. చాలా కొత్త కొత్త లొకేషన్లలో తీయాల్సివచ్చింది.
భారీగా ఖర్చు పెడుతున్నాం. విక్రమ్ చాలా మంచి దర్శకుడు. చాలా క్లారిటీతో తీస్తున్నాడు. అన్ని పనులూ తనకే అప్పగించేశా
* యుద్దం శరణం ముచ్చట్లేంటి?
– సోషల్ మీడియా నేపథ్యంలో సాగే సినిమా ఇది. సినిమా చూశా. చాలా బాగుంది. తప్పకుండా చైతూకి ఓ మైల్ స్టోన్‌గా మిగిలిపోతుంది.
* ఈ యేడాది టాలీవుడ్లో ఎక్కువ హిట్లు కనిపిస్తున్నాయి..
– అవును. 2017లో పరిశ్రమ బాగుంది. మంచి సినిమాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా గురించి అంతా మాట్లాడుకొంటున్నారు. ట్రెండ్ సెట్టర్ అంటున్నారు. నేనింకా సినిమా చూళ్లేదు. తప్పకుండా చూస్తా.
* విక్రమ్ వేదా రీమేక్ చేస్తున్నార్టగా
– విక్రమ్ వేదా రిమేక్ గురించి చాలామంది చెప్పారు. ఆ సినిమా కూడా చూళ్లేదు. చూస్తా.
* కొత్త సినిమాల మాటేంటి?
– కొత్త సినిమాల గురించి ఇంకేం ఆలోచించలేదు. కల్యాణ్ కృష్ణ ` బంగార్రాజు` కథ ఇంకా చెప్పలేదు. చెప్తా.. చెప్తా అంటున్నాడు. సీక్వెల్ కాబట్టి కథ బాగుండాలి..
* ఈమధ్య యంగ్ హీరోలు కూడా… టీవీ షోల్లో అదరగొడుతున్నారు..
– అవును. టీవీ.. మంచిదే. జనాలకు ఇంకా త్వరగా చేరువ అవుతాం. అందుకే నేను కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు చేశా. తారక్ చేస్తున్న బిగ్ బాస్ షో బాగా నచ్చింది. తను బయట ఎలా ఉంటాడో.. టీవీలో అలా కనిపిస్తున్నాడు. తన
రియల్ క్యారెక్టర్ ఏంటో బిగ్ బాస్ చూపిస్తోంది.