నువ్వా నేనా అన్నట్టుగా నంద్యాల ఉప ఎన్నికలు సాగాయి. అధికార ప్రతిపక్షాల్లో గెలుపు ఎవరదనేది కూడా సరిగా అంచనా వేయలేని పరిస్థితి ఓ దశలో నెలకొంది. అంతేకాదు, ఏ పార్టీ గెలిచినా దాదాపు పదివేలకు మించి మెజారిటీ రాదంటూ కొన్ని సర్వేలు కూడా చెప్పాయి. కానీ, ఆ అంచనాలన్నీ తలకిందులు చూస్తూ… నంద్యాల ఉప ఎన్నిక తీర్పు ఏకపక్షంగానే ఉంటోంది. ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ తెలుగుదేశం స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. వైకాపా అభ్యర్థి ఓటమి దాదాపు ఖరారు కావడంతో శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ ప్రాంతం నుంచి బయటకి వచ్చేశారు. ఇంకా మరికొన్ని రౌండ్లు ఫలితాలు వెల్లడికావాల్సి ఉండగానే ఆయన బయటకి వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం గెలుపుకి గల కారణాలను శిల్పా విశ్లేషించారు.
నంద్యాలలో టీడీపీ గెలుపునకు రెండు రకాల కారణాలు కనిపిస్తున్నాయని శిల్పా చెప్పారు. ఒకటీ.. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ప్రజల్లో సానుభూతి వ్యక్తమైందని చెప్పారు. రెండోది… తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టిందనీ, ఓటుకు రూ. 2 వేలు, 3 వేలు ఖర్చుపెట్టిన ఘటనలు కూడా ఉన్నాయంటూ ఆరోపించారు. నాయకులను కూడా పెద్ద మొత్తం సొమ్ము ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు. నంద్యాలలో అధికార పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లెయ్యలేదన్నారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి… అధికార పార్టీకే ఓటేస్తే బాగుంటుందని ప్రజలు భావించి ఉండొచ్చన్నారు. ముస్లిం మైనారిటీలు కూడా తెలుగుదేశం వైపే మొగ్గు చూపారని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో జగన్ బాగా ప్రచారం చేశారనీ, కానీ టీడీపీకి సానుభూతి, డబ్బు పంపిణీ కలిసొచ్చిందని శిల్పా చెప్పారు.
ఇక, ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని శిల్పా ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా.. తెలుగుదేశం ఓడిపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అఖిల ప్రియ ఛాలెంజ్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సవాలు గురించి శిల్పాను ప్రశ్నిస్తే.. ఆయన మాట మార్చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ సవాలు చేసిన విషయం వాస్తవమేననీ, కానీ అఖిల ప్రియ నుంచి తన ఛాలెంజ్ కు సరైన బదులు రాలేదని శిల్పా చెప్పడం విశేషం! ఈ సవాలును స్వీకరిస్తున్నట్టు అఖిల ప్రియ ఎక్కడా చెప్పాలేదనీ, ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదనీ, దాని గురించి తరువాత మాట్లాడదాం అని తప్పుకున్నారు! సరే, కౌంటింగ్ పూర్తి కానప్పుడు… టీడీపీ గెలుపునకు కారణాలు ఇవీ అంటూ ఎలా విశ్లేషించేస్తారు..? కౌంటింగ్ పూర్తి కాకుండానే అక్కడి నుంచి బయటకి ఎందుకు వెళ్లిపోయారు..?