నంద్యాల ఫలితంపై వైకాపాలో సరైన విశ్లేషణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. భావోద్వేగాల కోణం నుంచే నంద్యాల ప్రజల తీర్పును చూస్తున్నట్టున్నారు. నంద్యాలలో పనిచేసిన కార్యకర్తలకు జగన్ ధన్యవాదాలు చెప్పారు. కానీ, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టుగా ఒక్కమాట కూడా చెప్పకపోవడం గమనార్హం! దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. నంద్యాల ఫలితాన్ని వైకాపా ఎలా చూస్తోందో అనేది! 2019 మహా కురుక్షేత్రానికి నంద్యాల నాంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడా మాట మార్చేశారు. ఇది రెఫరెండమ్ ఎలా అవుతుందని విలేకరులనే ఉల్టా ప్రశ్నించారు! నంద్యాలలో టీడీపీ సాధించింది విజయం అని చంద్రబాబు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదని అన్నారు.
ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. దాదాపుగా రూ. 200 కోట్ల సొమ్మును టీడీపీ నంద్యాలలో పంచిపెట్టిందన్నారు. ఓటర్ల ఇంటికి వెళ్లి, వాళ్లని భయభ్రాంతులకు గురిచేసి, టీడీపీకి ఓటెయ్యకపోతే పెన్షన్లు ఆగిపోతాయనీ, రేషన్లు రాకుండా పోతాయని బెదించారన్నారు. పెద్ద ఎత్తున పోలీసులను వాడుకున్నారనీ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఎన్నికల ప్రచారంతో తాను ప్రజలతో మాట్లాడాననీ, చంద్రబాబు చేసిన మోసానికి వ్యతిరేకంగా వారు ఓటేస్తామంటూ పదేపదే చేతులు ఎత్తి మరీ అవునూ అవునూ అని చెప్పారన్నారు. అయినాసరే, చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిచారంటే… ఇది జనరల్ ఎలక్షన్ కాదు కాబట్టి అని జగన్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటేసినా, ఆయన వెంటనే అధికారంలోంచి తప్పుకునే పరిస్థితి ఉండదని ఓటర్లు భావించారనీ, భయపడుతూ ఆయనకి ఓట్లేశారు కాబట్టే చంద్రబాబు గెలిచారని విశ్లేషించారు!ఇక, రెఫరెండమ్ గురించి మాట్లాడుతూ… ఒకే ఒక్కచోట ఎన్నిక జరిపితే అది రెఫరెండమ్ ఎలా అవుతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితోనూ రాజీనామా చేయించి, ఒకేసారి ఎన్నికలకు వస్తే అది రెఫరెండమ్ అవుతుందని చెప్పారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేశామనీ, వైకాపాలో వచ్చినవారు రాజీనామా చేసి రావాలనే నియమాన్ని పాటించామన్నారు.
నంద్యాల ఫలితాలను చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కోణం నుంచే జగన్ విశ్లేషించుకుంటున్నారు. అంతేగానీ, వాస్తవ పరిస్థితులు.. వైకాపా శ్రేణుల లోపాలు, జగన్ స్వయంకృతాల గురించి ఆలోచించడం లేనట్టుగా ఉంది. నిజానికి, నంద్యాల ఎన్నికలను సెమీ ఫైనల్స్ అని చెప్పిందే జగన్! ఉప ఎన్నిక వేడిని పెంచింది వారే. ఇప్పుడా మాట మార్చేసి కొత్త భాష్యం చెబుతున్నారు. ఒక చోట ఎన్నిక జరిగితే అది రెఫరెండమ్ ఎలా అవుతుందని అంటున్నారు! ఒకవేళ వైకాపా గెలిచి ఉంటే.. దాన్ని కూడా ఇలానే చెప్పుకునేవారా..? అన్నిటికీ మించి ప్రజాతీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఊసే ఎత్తకుండా.. తనకేదో దెబ్బ తగిలిందనీ, దాన్ని తట్టుకుని అవకాశం వచ్చినప్పుడు తామూ దెబ్బ కొడతామని చెప్పడం మరీ విశేషం! భావోద్వేగాలను పక్కనబెట్టి, వైకాపా వైఫల్యాల గురించి మాట్లాడితే పరిస్థితి కనిపించడం లేదు! చంద్రబాబుపై అక్కసును వెళ్లగక్కుతూ డబ్బు పంచారనీ, అధికార దుర్వినియోగం చేశారనీ, భయభ్రాంతులకు గురిచేశారనీ… నంద్యాల ప్రజల తీర్పును చంద్రబాబు కోణం నుంచే చూస్తే ఎలా..?