నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని అధికార పార్టీ తెలుగుదేశం దక్కించుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే, రాబోయే కురుక్షేత్రానికి నంద్యాల నాంది అంటూ జగన్ పిలుపునిచ్చారు. ఇక్కడి నుంచే మార్పు మొదలన్నారు. కానీ, ఫలితం తారుమారు అయ్యేసరికి ఆ మాటపై వైకాపా స్పందన మారిపోయింది. ఇది కేవలం ఒక నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నిక మాత్రమే అని జగన్ చెప్పారు. అంతేకాదు, ఇదే సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని సవాలు విసిరారు. వైకాపా టిక్కెట్ పై గెలిచినవారందరూ ఎన్నికల బరిలోకి రావాలనీ, అప్పుడు వైకాపా సత్తా ఏంటో తెలుస్తుందని జగన్ ఛాలెంజ్ చేశారు. ఫిరాయింపుదారులను ఎన్నికల క్షేత్రంలో నిలిపితే, అది అసలైన రెఫరెండమ్ అవుతుందని వైకాపా నేతలు కూడా ఇప్పుడు చెబుతున్నారు.
నంద్యాల ఫలితాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జగన్ పై ఘాటైన విమర్శలు చేశారు. ఇలాంటి ప్రతిపక్ష నేతను తాను ఎప్పుడూ చూడలేదనీ, ఆయన మాట్లాడే భాష ఎంత దారుణంగా ఉన్నా ప్రజల కోసం సహిస్తూ వచ్చామన్నారు. అభివృద్ధి చేసినవారిని ప్రజలు గుర్తిస్తారనీ, నంద్యాలలో అదే జరిగిందంటూ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పాలనపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని నంద్యాల ఉప ఎన్నిక రుజువు చేసిందన్నారు. ఇదే సందర్భంలో రాజీనామాల అంశాన్ని విలేకరులు ప్రశ్నిస్తే.. జగన్ కు ఎన్నికలంటే సరదాగా ఉందనీ, కావాలనుకుంటే వైకాపా ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా రాకపోతే జూన్ లో వైకాపా పార్లమెంటు సభ్యులతో రాజీనామాలు చేయిస్తా అన్నారనీ, ముందుగా ఆ పని చెయాలంటూ సీఎం కూడా ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు జగన్ అడుగడుగునా అడ్డు తగులుతున్నారనీ, ప్రాజెక్టు నిర్మిస్తుంటే వాటిపై కోర్టుకు వెళ్తుంటారనీ, నిధుల కోసం ప్రయత్నిస్తే అక్కడ కూడా అడ్డుకునేలా కేంద్రానికి లేఖలు రాస్తారంటూ మండిపడ్డారు.
మొత్తానికి, అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి ఈ రాజీనామాల టాపిక్ తెరమీదికి వచ్చింది. నిజానికి, ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించే పరిస్థితి ఇప్పట్లో లేదు. ఆ విషయంలో వైకాపా డిమాండ్ పై నేరుగా స్పందించేందుకు టీడీపీ కూడా సిద్ధంగా లేదు. అందుకే, ఇదే విషయాన్ని ఇప్పుడు వైకాపా మళ్లీ తెరమీదికి తెస్తోంది. ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించాలనే డిమాండ్ కు టీడీపీ దగ్గర సరైన సమాధానం లేదు కాబట్టి… చర్చను అటువైపు వెళ్లనీయకుండా, వైకాపా ఎంపీల రాజీనామా విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు.
విచిత్రం ఏంటంటే.. ఈ విషయంపై వైకాపా కూడా నేరుగా స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా పోరాటాన్ని వైకాపా మధ్యలోనే వదిలేసింది. ఉద్యమిస్తాం, సాధిస్తాం, రాజీనామాలు చేస్తాం, ఒత్తిడి తెస్తాం, ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం అంటూ జగన్ మాట్లాడారే తప్ప, కార్యరూపంలో కనిపించింది పెద్దగా లేదు. సో.. ఎంపీల రాజీనామాల ఊసెత్తితే ధీటుగా స్పందించే పరిస్థితి వైకాపాలో కూడా లేదు. కాబట్టి, ఈ రాజీనామాల టాపిక్ పై టీడీపీ, వైకాపాలు ఒక ప్రశ్నకు ఇంకో ప్రశ్న బదులుగానే చెప్పుకుంటాయి. అంతకుమించి ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి. ఎవరికి ఉండాల్సిన వీక్నెస్ వారి దగ్గర ఉంది కదా!