గోల్డెన్ డేస్ ఆఫ్ తెలుగు సినిమా… అంటుంటారే ఆ శకం మళ్లీ మొదలైనట్టే అనిపిస్తోంది. అవును.. తెలుగు సినిమాకి బంగారు రోజులు వచ్చాయి! వరుస పరాజయాలు, స్టార్ ఇమేజీలు, బడ్జెట్ ఫెయిల్యూర్లూ తెలుగు సినిమాని దారుణంగా దెబ్బ తీస్తున్న తరుణంలో… కొన్ని అనూహ్య విజయాలు టాలీవుడ్‌ని పలకరించాయి. భవిష్యత్తుపై భరోసా కలిగించాయి. 2017లో చిత్రసీమను చుట్టుముట్టిన విజయాలు కనీవినీ ఎరుగనివేం కావు. ఈ వసూళ్ల లెక్కలు ఇది వరకూ చూశాం. కాకపోతే – కథలు, పాత్రీకరణ, ఆలోచనలు ఇవన్నీ టాలీవుడ్‌కి కొత్త ఉత్సాహాన్ని అందించాయి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లెద్దు.
తెలుగు సినిమా ఎప్పుడూ ఒకే మూసలో కొట్టుకెళ్లిపోయేది. ఓ ఫ్యాక్షన్ సినిమా వస్తే… హిట్టయితే, వరుసగా పది పట్టాలెక్కేసేవి. హీరోలు, దర్శకులు ఒకే కథని పట్టుకొని వేలాడేవారు. ఒకే జోనర్‌ని నమ్ముకొనే వారు. అయితే ఈ పరిస్థితిలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. ఇటీవల హిట్టయిన సినిమాలే తీసుకోండి ఓ జోనర్‌కీ మరో జోనర్‌కీ సంబంధం లేదు. నేనే రాజు నేనే మంత్రికీ ఫిదాకీ ఎక్కడైనా పోలిక ఉందా? నిన్నుకోరి సినిమాకీ, మొన్నొచ్చిన అర్జున్ రెడ్డికీ సంబంధం ఉందా? సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టిన ఖైది నెం.150 ఓ జోనర్. గౌతమి పుత్ర శాతకర్ణి మరో జోనర్. వీటికి భిన్నమైన కథ శతమానం భవతి.. మూడూ హిట్టే కదా. రానా చేసిన ఘాజీకీ, బాహుబలి 2కీ పోలికే లేదు. నేనే రాజు నేనే మంత్రి మరో తరహా కథ. మూడింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఆయా సినిమాల స్థాయిలో. రకరకాల జోనర్లను పరిచయం చేసే దిశగా టాలీవుడ్ రూపకర్తలు అడుగులు ముందుకేస్తున్నారు.
‘ఈ తరహా సినిమా తీస్తే జనాలు చూడరేమే’ అనే అనుమానాలు ఉండేవి. ప్రేక్షకులు కూడా అలానే రియాక్ట్ అయ్యేవారు. వాళ్లకు నచ్చే సినిమాలే తీయాల్సివచ్చేది. గత్యంతరం లేక వచ్చిన సినిమాల్నే ప్రేక్షకులూ చూసేవారు. ఇప్పుడు అలా కాదు. రకరకాల రుచులు వడ్డిస్తున్నారు. కొత్త తరహా వినోదాలు పంచుతున్నారు. ఎలాంటి కథనైనా తీసుకోండి.. సినిమా బాగుంటే చాలు అంటున్నారు ప్రేక్షకులు. ఇది దర్శక నిర్మాతలకు కొండంత భరోసా. ఇప్పుడు ఏ ఫార్ములా కథలకూ టాలీవుడ్లో చోటు లేదు. రూల్స్ ని బ్రేక్ చేయడానికి ఆడియన్స్ పర్మిషన్స్ ఇచ్చేశారు. టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిపై పడిన మచ్చలు కూడా తొలిగిపోతున్న తరుణం ఇది. ఇప్పుడు కావల్సింది సత్తా ఉన్న కథలు, వాటిని సమర్థంగా తెరకెక్కించగల దర్శకులే. ప్రయోగాలకు ఇంతకు మించిన తరుణం మరోటి దొరకదు. దర్శకులూ.. ఇక మీదే ఛాన్స్! రెచ్చిపోండంతే!!