ఈ మాత్రం లాజిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎందుకు తట్టలేదంటారూ..? పోనీ, మంత్రి అమర్ నాథ్ రెడ్డిని ఈ అంశంపై స్పందించాలని ఇన్నాళ్లూ ఎందుకు కోరలేదంటారూ..? మంత్రి దగ్గర అంత అద్భుతమైన లాజిక్ ఉన్నప్పుడు.. ఎప్పుడో వాడేసుకోవాల్సింది! ఇన్నాళ్లూ అనవసర కాలయాప చేశారే.! దేని గురించి అనుకుంటున్నారా.. అదేనండీ, ఫిరాయింపుదారుల విషయం. వైకాపా నుంచి ఓ ఇరవైమంది టీడీపీలోకి వచ్చి చేరారు కదా. వారితో రాజీనామాలు చేయించాలనే డిమాండ్ ను వైకాపా నేతలు ఇప్పుడు మరోసారి తెరమీదికి తెచ్చిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో వారితో రాజీనామాలు చేయించి, ఎన్నికలకు వస్తే అదే అసలైన రెఫరెండమ్ అవుతుందని వైకాపా నేతలు సవాళ్లు విసురుతున్నారు. దీనికి టీడీపీ నుంచి కూడా ధీటైన ప్రతిసవాళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
టీడీపీ శాసనసభ్యులు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారనీ, ఎన్నికలకు వెళ్లేందుకు వెనకాడటం లేదని అమర్ నాథ్ రెడ్డి అన్నారు. గెలవలేమన్న భయంతోనే రాజీనామాలు చేయకుండా ఉన్నామనుకోవడం పొరపాటన్నారు. ‘మరోసారి ఎన్నికల పేరుతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎందుకు..? ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నష్టం జరుగుతుంది. సమయం వృథా అవుతుంది. దాని వల్ల నీకొచ్చిన లాభమేందీ..? 20 మంది శాసన సభ్యులతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు పోతే, నువ్వేమైనా ముఖ్యమంత్రివి అవుతావా..? 20 మంది గెలిచినా నువ్వు ముఖ్యమంత్రివి కావు కదా. అలాంటప్పుడు, రాజీనామాల గురించి మాట్లాడటం ఎందుకూ’ అంటూ జగన్ ను ఉద్దేశించి అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నంద్యాల ఎన్నిక ఫలితాలు చూసిన తరువాత కూడా జగన్ బుద్ధి మారడం లేదని విమర్శించారు. చేతనైతే వైకాపా ఎంపీలతో రాజీనామాలు చేయించి, వారే ఎన్నికలకు వెళ్లాలంటూ సవాలు చేశారు.
టీడీపీ, వైకాపాల మధ్య సవాలు అంశాన్ని కాసేపు పక్కనపెడితే.. ఫిరాయింపుదారులు ఇన్నాళ్లూ ఎందుకు రాజీనామా చేయలేదనే అంశంపై మంత్రి ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది. ప్రజాధనం దుర్వినియోగం అనే ఒకేఒక్క కారణంతో, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆలోచనతోనే రాజీనామాలు చేయడం లేదట! ఫిరాయింపుదారులతో ఎందుకు రాజీనామాలు చేయించరూ అంటూ ఇన్నాళ్లూ చంద్రబాబుపై చాలామంది విమర్శలు చేసేవారు. కానీ, అసలు విషయం ఇదన్నమాట! ఫిరాయింపుదారులను వెనకేసుకుని రావడం కోసం ఇలాంటి లాజిక్ ఒకటి ఉంటుందని అమర్ నాథ్ రెడ్డి చెప్పడం భలేగా ఉంది. అయినా, ప్రజలూ ప్రజాధనం, ప్రజాసేవ లాంటి బాధ్యతాయుతమైన ఆలోచనలే నిజంగానే ఉంటే… ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును వెక్కిరిస్తూ ఫిరాయింపులకు ఎవరైనా పాల్పడతారా..? ఒక పార్టీ టిక్కెట్ పై గెలిచి, రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరతారా..? మంత్రి పదవుల్ని అనుభవిస్తారా..? ఫిరాయింపుల్ని ఇలా కూడా సమర్థించుకోవచ్చని మంత్రి ఏం చెప్తిరి కదా!