పిసిసి మాజీ అద్యక్షుడు ప్రస్తుతం టిఆర్ఎస్ ఎంపి డి.శ్రీనివాస్‌ను ఎంపిగా పంపడమే ఎక్కువ అని రాజకీయ వర్గాలు వాదిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన అసంతృప్తి అంతకుమించి ఆవేదనగా వున్నట్టు కథనాలు వస్తూనే వున్నాయి. తనను కలిసిన వారిదగ్గర వ్యక్తం చేస్తున్నారు కూడా. బహిరంగంగా మాత్రం అధినేతపై విశ్వాసం, తన స్థానంపై సంతోషం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ఏమనుకున్నా సరే బయిట పెద్దగా సానుభూతి రావడం లేదు. డిఎస్కుఇప్పటికి ఇచ్చిందే చాలా ఎక్కువ..ఇంకా అసంతృప్తి అనడంలో అర్థం లేదు అని టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధి ఒకరు కోపంగా కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసి టిఆర్ఎస్కు మేలు చేసిన ఆయనకు ఈ దశలో రాజ్యసభ తప్ప మరేం చేయాలట? అని మరో కాంగ్రెస్ మాజీ ఎంపి అపహాస్యం చేశారు. నిజానికి డిఎస్ ఇప్పుడు బరువు తగ్గించుకునే పనిలో వున్నారు. ఫలితాలు కూడా సాధించారట. ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వున్నాయి. అలాటప్పుడు ఇంకా ఏదో రావాలని ఆశపడితే ఎవరు సానుభూతి చూపిస్తారని ఈ నాయకులు అంటున్నారు.