తమిళనాడు రాజకీయాలు ఇంకా ఉత్కంఠను పెంచుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకేలోని సీఎం ఈపీయస్, ఓపీయస్ వర్గాలు చేతులు కలిపాయి. దీంతో చిన్నమ్మ శశికళ వర్గం కోరలు పీకేయడం ఖాయం అనుకున్న తరుణంలో దినకరన్ ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను పాండిచ్చేరి రీసార్ట్ లో పెట్టి, క్యాంపు రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిందనీ, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి కూడా తెలిసిందే. మరోపక్క ప్రతిపక్షం కూడా గవర్నర్ ను కలిసిందీ, గవర్నర్ తీరుపై స్టాలిన్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో గవర్నర్ ఎలాంటి చర్యలకు దిగుతారా అనేది మరోసారి ఆసక్తికరంగా మారింది. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందనా ఉండకపోవడం విశేషం.
తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య త్వరలో నలభైకి చేరబోతోందంటూ దినకరన్ ధీమా వ్యక్తం చేస్తూ తాజాగా ప్రకటించడం విశేషం. గడచిన వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే తెర దించేందుకు దినకరన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తన వర్గం ఎమ్మెల్యేలందరికీ చెన్నైకి తీసుకొస్తారనీ, అక్కడి నుంచీ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే యోచనలో దినకరన్ ఉన్నట్టు చెబుతున్నారు. ఢిల్లీ పయనం ఎందుకంటే… గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోడంతో, రాష్ట్రస్థాయిలో కూర్చుంటే పరిస్థితి ఒక కొలీక్కి వచ్చేది లేదన్న అభిప్రాయంతో రాష్ట్రపతి దగ్గరకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి, పళనిస్వామి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా గవర్నర్ కే లేఖ ఇచ్చారు. దీనిపై ఏదో ప్రకటన ఉంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు.
దీంతో గవర్నర్ తీరుపై న్యాయ పోరాటానికి కూడా దినకరన్ వర్గం సిద్ధమైంది. మద్దతు ఉప సంహరించుకుంటున్నట్టు ఎమ్మెల్యేలు ప్రకటించాక కూడా అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టలేదంటూ కోర్టును ఆశ్రయించారు. ఇంకోపక్క, స్టాలిన్ కూడా ఢిల్లీకి బయలుదేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా గవర్నర్ మీదే ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారట. చెన్నై రాజకీయ వేడి ఢిల్లీకి చేరబోతున్నట్టు కథనాలు రావడంతో ఓపీయస్, ఈపీయస్ వర్గాల్లో కలవరానికి కారణమౌతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే సంఖ్య మరో వారం రోజుల్లో మరింత పెరుగుతుందని దినకరన్ ధీమా వ్యక్తం చేయడం, ఏం జరుగుతుందో వేచి చూడండి అంటూ ఆయన ప్రకటించడంతో అధికార పార్టీలో ఎడతెగని చర్చలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.
మొత్తానికి, తమిళనాట కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్ఠంభనకు త్వరలోనే ఒక పరిష్కారం లభించబోతున్నట్టుగానే ఉంది. దినకరన్ వ్యూహం ప్రకారమే అన్నీ జరిగితే… తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ వర్గం పట్టు సాధించినట్టే. జైల్లో ఉంటూనే తన పంతం నెగ్గించుకున్నట్టు అవుతుంది. కానీ, అధికార పార్టీలోని రెండు వర్గాలకు ‘పెద్దన్న’ అభయం ఉందన్న సంగతి మరచిపోకూడదు. సో… దినకరన్ ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయా అనేది ఓ అనుమానం. మధ్యలో మరిన్ని అనూహ్యమైన ట్విస్టులు ఉండవనీ చెప్పలేం!