ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ ఈ యాత్ర సాగుతుందని ప్లీనరీలోనే ప్రకటించారు. ‘అన్న వస్తున్నాడు’ అనే పేరుతో ఓపక్క భారీ ప్రచారం కూడా సాగుతోంది. అయితే, ఈ నేపథ్యంలో హైకోర్టులో జగన్ కు చుక్కెదురైంది! కేసుల విచారణలో భాగంగా ఓ మినహాయింపు కోరుతూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఒక ప్రజాప్రతినిధిగా, పార్టీ అధ్యక్షుడిగా తాను జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందనీ, పాదయాత్ర చేయాల్సి ఉందనీ, కాబట్టి అన్ని చార్జిషీట్లపైనా విచారణకు వ్యక్తిగత హాజరు నుంచీ తనకు మినహాయింపు కావాలంటూ జగన్ కోరారు. ఈ ప్రతిపాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జగన్ పై తీవ్రమైన ఆర్థిక నేరాల ఆరోపణలు ఉన్నాయనీ, విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. వారంలో ఒక్క రోజు.. అంటే, శుక్రవారం తప్పనిసరిగా విచారణకు రావాలనీ, మిగతా రోజుల్లో ఆయన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
అక్టోబర్ నెలలో పాదయాత్ర చేపట్టబోతున్న నేపథ్యంలోనే ఈ మినహాయింపు కోరుతూ జగన్ కోర్టును ఆశ్రయించారనడంలో సందేహం లేదు. అయితే, కోర్టు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చడంతో… పాదయాత్ర ఎలా చేయాలనేది ఇప్పుడు వైకాపాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ పాదయాత్ర అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కలగలుపుతూ నడుస్తా అన్నారు. కానీ, కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే, పాదయాత్ర మొదలుపెట్టినా కూడా.. శుక్రవారం నాడు ఎక్కడుంటే, అక్కడి నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. విచారణ పూర్తయ్యాక.. మళ్లీ పాదయాత్రను కొనసాగించుకోవచ్చు! ఈ లెక్కన పాదయాత్రకు ప్రతీ శుక్రవారం బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. నిజానికి, అలా బ్రేకులు ఇస్తూ… మధ్యలో హైదరాబాద్ వచ్చి వెళ్తూ పాదయాత్ర చేయడం అనేది కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే! వేరే గత్యంతరం లేదని ఇదే పద్ధతిలో పాదయాత్ర చేద్దామనుకున్నా… దాని ప్రభావం మరోలా ఉంటుంది. అన్నిటికీమించి తెలుగుదేశం పార్టీ విమర్శలకు మరింత ఆస్కారం ఇచ్చినట్టవుతుంది.
ప్రస్తుతం వైకాపా వర్గాల్లో ఇదే తర్జనభర్జన జరుగుతోందని సమాచారం! ఇదే అంశమై జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే, విచారణకు హాజరు కాలేనంటూ జగన్ చూపిస్తున్నది ఓ రాజకీయ కారణం. పైగా, జగన్ ఎదుర్కొంటున్న ఆర్థిక నేరారోపణలు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపేవిగా ఉన్నాయంటూ న్యాయవాదులే చాలా సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించడం సరైన పద్ధతా కాదా అనే చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి, గుంటూరు ప్లీనరీలో పాదయాత్ర ప్రకటన చేయగానే ఇలాంటి అవరోధాలు వచ్చే అవకాశాలున్నాయని ముందుగానే విశ్లేషకులు అంచనా వేశారు. మొత్తానికి, జగన్ పాదయాత్రపై తాజా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి.