కేంద్ర క్యాబినెట్లో టిఆర్ఎస్ చేరికపై రకరకాల కథనాలు వూహాగానాలు వచ్చాయి. ఒకే పత్రికలో రెండు రకాలుగా వున్నాయి. ఎంపి కవితకు క్యాబినెట్లో చేరాలన్న ఆసక్తి వున్నమాట నిజమే కావచ్చు గాని రాజకీయంగా కెసిఆర్ అందుకు ఒప్పుకోవడం జరిగేపని కాదు. తెలంగాణలో మైనార్టి ఓటర్ల కోసం ఆయన మజ్లిస్‌ను జాగ్రత్తగా పట్టుకొస్తుంటారు. నిజాంను నిత్యం పొగుడుతుంటారు. బిజెపితో ఇంకా చెప్పాలంటే కేంద్రంతో పాలనావసరాల కోసం మెతగ్గా వుండొచ్చు గాని 2019 ఎన్నికల్లో మళ్లీ గెలవడం ఆయనకు ముఖ్యం. అందుకే సూటిగానే బిజెపి ప్రతిపాదనను తోసిపుచ్చారు. విషయమేమంటే గతంలో వాయిదా పడిన కంటి చికిత్స సెప్టెంబరు5న జరుగుతుంది. కెసిఆర్‌కు ఇంజక్షన్ చేయించుకోవడమన్నా భయమేనని చెబుతుంటారు. ఆయనే ఒకసారి చెప్పారు. అలాటిది కంటితో పని. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కూడా వెళుతున్నారట. యాదృచ్చికంగా మంత్రివర్గ విస్తరణ రావడంతో వూహలు రెక్కలు విప్పాయి. అయితే తమకు ఆహ్వానం వచ్చినా చేరవద్దని అధినేత నిర్ణయించినట్టు లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి చెప్పారు. అయితే కవితతో సహా కొందరు సీనియర్లకు సంపన్న ఎంపిలకు కేంద్రంలో చేరితే బాగుండునన్న ఆలోచన వున్న మాట నిజం. వాస్తవంగా టిఆర్ఎస్ను చేర్చుకోవాలనుకుంటే ఆ విషయమై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతాయి గాని మధ్యంతర నాయకులతో మాట్లాడరు. తెలంగాణలో తామే పెద్ద శక్తిగా ఎదగాలని బిజెపి కోరుకుంటుంటే మజ్లిస్ చెలిమి మేలని టిఆర్ఎస్ అనుకుంటుంది.