కమ్యూనిస్టులకు ఎన్నికల్లో సీట్లు రాకున్నా, ఇతర పెద్ద పార్టీలకు వుండే హంగులూ ఆర్భాటాలు లేకున్నా ప్రజల కోసం పోరాడేవారిగా గౌరవం మాత్రం వుంటుంది. అందరూ ఆ విషయం అంగీకరించి ఆ తర్వాత రకరకాల వ్యాఖ్యలు విమర్శలు వదులుతుంటారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న సినీ ప్రముఖులు ఇద్దరూ అదే కోవలో మాట్లాడ్డం అందుకు మరో నిదర్శనం. జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసిన రోజు నుంచి కమ్యూనిస్టుపార్టీల గురించి చెబుతున్నారు.
ఆ మాటలను బట్టి కొంతమంది ఆయనకూ వారికీ పొత్తు కుదిరిపోయినట్టే చెప్పేస్తుంటారు గాని అది ఇప్పుడప్పుడే చెప్పగలిగింది కాదు. ఇక మరో మహానటుడు కమల్‌హాసన్ తమిళనాడు రాజకీయాల్లోకి రావడానికి ఇప్పుడిప్పుడే సంకేతాలు వదులుతున్నారు. ఆయన కేరళ ముఖ్యమంత్రిని కలుసుకొని చర్చలు జరిపారు. అంతేగాక తనకెప్పుడూ వామపక్ష నేతలే హీరోలని, తనది కాషాయ రంగు కాదని పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి చెప్పారు. వాస్తవానికి కమల్ హాసన్ చాలా ఏళ్ల కిందటనే తీసిన సత్యేమే శివం ఆయన భావాలకు అద్దం పట్టింది. తాజ్లేకపోయినా ప్రేమ వుంటుంది, సోవియట్ కూలిపోయినా కమ్యూనిజం వుంటుంది అని ఆయన అందులో అంటారు. యువజన మహాసభల వంటి వాటిని ప్రారంభించడం సహాయపడటం కూడా చేస్తుంటారాయన.కనుక విజయన్ కలుసుకోవడం గాని, ఇలా మాట్లాడ్డం గాని పెద్ద ఆశ్చర్యం లేదు. సూపర్ స్టార్ రజనీ కాంత్ బిజెపి నేతలను సంఘ పరివార్ ప్రతినిధులను కలుసుకుంటున్న సమయంలో కమల్ ఈ విధంగా మాట్లాడ్డం మరో ప్రత్యేకత.