కాపుల రిజర్వేషన్ల అంశం ఏపీలో రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి ఇదో సమస్యగా మారకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తోంది. త్వరలోనే రిజర్వేషన్లు కల్పించబోతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే, మరోపక్క ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తానని చెబుతూనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ అంశంపై మరోసారి స్పందించారు. తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా టీమ్ శతఘ్నితో మాట్లాడారు. అందరికీ విద్యా వైద్యంతోపాటు సమాన అవకాశాలు ఉండాలని అప్పట్లో అంబేద్కర్ ఆకాంక్షించేవారని చెప్పారు. ఆయనకు ఘన నివాళి అర్పించాలంటే రిజర్వేషన్లు లేని సమాజం కావాలన్నారు. వెనుకబడిన వారికోసమే రిజర్వేషన్లు పెట్టారనీ, కానీ ప్రభుత్వాలు సరిగా అమలు చేయకపోవడం వల్లనే డిమాండ్లు పెరుగుతూ వస్తున్నాయని పవన్ అన్నారు.
ఇక, కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రస్థావిస్తూ.. ఇస్తామని నిర్ణయిస్తే ఇవ్వండీ, లేదంటే ఇవ్వడం కుదరదు అని స్పష్టం చెప్పేయాలనీ, నాన్చుడు ధోరణి అవలంభించొద్దు అని పవన్ అన్నారు. తాను అన్ని కులాలనూ గౌరవిస్తాననీ, ఒక వర్గానికి తానెప్పుడూ పరిమితం కాకుండా ఉంటానని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ ఉద్యమం గురించి మాట్లాడుతూ… ఆయన ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగించి ఉండాల్సిందన్నారు. ఆయన నిరసన తెలపడం అనేది ఆయన వ్యక్తిగత హక్కు అనీ, ఆయన పాదయాత్రను ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ అడ్డుకునే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మాత్రమే వారు జోక్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
పవన్ తాజా అభిప్రాయం ఎలా ఉందంటే… ముద్రగడ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించినట్టు అనుకోవచ్చా! ప్రభుత్వాలు, పోలీసులు ఆయన నిరసనను అడ్డుకోవడం సరికాదన్నారు.. అంతవరకూ బాగానే ఉంది! కానీ, కొద్దిరోజుల క్రితమే పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబును కలుసుకున్న సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై విదేశీ బృందంతో అధ్యయనం చేయించి, దాని గురించి మాట్లాడేందుకు అమరావతి వెళ్లి ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాపుల రిజర్వేషన్ల గురించి ప్రస్థావనకు వచ్చినట్టూ చెప్పారు! కాపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కరెక్ట్ అన్నట్టుగా పవన్ మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే సరైందని అప్పుడు పవన్ అభిప్రాయపడ్డట్టు కథనాలొచ్చాయి. అంతేకాదు, పాదయాత్రల వల్లనే సమస్యలు పరిష్కారాలు అవుతాయని అనుకోవడం పొరపాటని కామెంట్ చేసినట్టు కూడా మీడియాలో వచ్చింది! ఇది
ముద్రగడను ఉద్దేశించి చేసిందే కదా. కానీ, ఇప్పుడేమో ముద్రగడ పాదయాత్ర ఆపకుండా ఉండాల్సిందనీ, ఆయన్ని అడ్డుకోవడం వ్యక్తిగత హక్కుల్ని కాలరాసినట్టే అవుతుందని పవన్ మాట్లాడుతున్నారేంటి..? అంటే, చంద్రబాబు ఎదురుగా కూర్చునేసరికి ఒకలా… తన సోషల్ మీడియా సిబ్బంది ఎదురుగా ఉన్నప్పుడు మరోలా పవన్ మాట్లాడారని అర్థం చేసుకోవాలా..? లేదంటే.. ముద్రగడ నిరసన తెలపడం అనేది ఆయన వ్యక్తిగత యాంగిల్ నుంచీ ఇప్పుడు చూస్తున్నారా…? కాపుల రిజర్వేషన్లు అనేది ప్రభుత్వం కోణం నుంచీ నాడు అర్థం చేసుకున్నారా..?