సమర్థత ప్రాతిపదికన మరింత సమర్థత పెంచడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేశారని చెబుతున్నారు. బాగానే వుంది. ఆయన సమర్థతలపై నివేదికలు తెప్పించారనీ అంటున్నారు గాని బయిటపెట్టలేదు. అయితే ఏడాది ఆలస్యంగానైనా సాక్షాత్తూ ఆర్బిఐ నోట్లరద్దుపై విడుదల చేసిన నివేదిక సంగతేమిటి? దీనికి బాధ్యులెవరు? ఆర్థికశాఖ రక్షణ శాఖ కూడా చూస్తున్న అరుణ్‌జైట్లీ కాశ్మీర్లో పరిస్థితి, డోక్లాం వంటివాటికి బాధ్యత వహిస్తారా? రైల్వే ప్రమాదాల పరంపర మాటేమిటి?
నోట్లరద్దుపై కేంద్ర చెప్పిన ఒక్క మాటా నిజం కాలేదు సరికదా దేశం ప్రజలూ ఘోరంగా నష్టపోయారు. వందమందికి పైగా ప్రాణాలు పోగా జిడిపి దాదాపు ఒకటిన్నర శాతం క్షీణించింది. బ్యాంకుల పరిస్థితి తలకిందులైంది. కోట్లాది మంది అసంఘటిత జీవుల జీవితాలే అతలాకుతలమైనాయి. మరి ఇంత పెద్ద వైఫ్యలానికి బాధ్యుత లేకుంటే సంజాయిషీ చెప్పేవారే కనిపించకుంటే ఇక జవాబుదారీ తనం ఏముంటుంది?
అప్పటి ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ మొదటి సారి పెదవి విప్పి దీనిపై చెప్పిన మాటలు ప్రభుత్వ దోషాన్ని కళ్లకు కడుతున్నాయి. దీర్ఘకాలిక లాభాల మాట ఏమైనా తక్షణం చాలా మూల్యం చెల్లించవలసి వుంటుందని ఆయన హెచ్చరించారట. అంటే ఆర్బిఐ సలహా మేరకు దాని ద్వారానే ఇదంతా జరిగిందని చెప్పే మాట నిజం కాదు. మరైతే ఎవరు ఇదంతా చేశారు? ఎందుకు చేశారు? మంత్రివర్గ విస్తరణ వంటి సందర్భంలో వారిని తొలగించనవసరం లేదా?