కేంద్రమంత్రి వర్గ విస్తరణ పూర్తయిపోయింది. వివిధ రాష్ట్రాల్లోకి మిత్రపక్షాలకూ కొత్త దోస్తులకూ స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ, ఆ జోలికి పోకుండా తమదైన ముద్రవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీంతో మిత్రపక్షాలు కొంత అసంతృప్తితో ఉన్నాయి. సొంత పార్టీ కేడర్ ను కూడా కొన్ని విమర్శలు వినిపిస్తూ ఉండటం విశేషం. రాష్ట్రాల్లో భాజపా విస్తరణకు చూస్తున్న ఈ తరుణంలో… ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని తెలుగు రాష్ట్రాల భాజపా కేడర్ నుంచి ఓ అభిప్రాయం వ్యక్తమౌతోంది. మంత్రి వర్గ విస్తరణలో మనకు ఏమాత్రం ప్రాధాన్యత కల్పించని పార్టీ కోసం ఎందుకు పనిచెయ్యాలనే ధోరణి కిందిస్థాయిలో వినిపించే అవకాశం ఉందనే వాదన తెరమీదికి వస్తోంది. అయితే, ఈ వాదనలను జాతీయ స్థాయి నేతలతో కొంతమంది ఎంపీలు వినిపించారనీ, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే అక్కడి కేడర్ తో సమర్థవంతంగా పనిచేయించడం ఎలా సాధ్యమనే ప్రశ్న వారి ముందుంచారనీ సమాచారం. ఈ ప్రశ్నకు వేయగానే ఓ కొత్త లాజిక్ ను ఢిల్లీ పెద్దలు వినిపిస్తున్నారట!
ఒక రాష్ట్రం నుంచి ఎక్కువమంది కేంద్రమంత్రులు ఉన్నంత మాత్రాన, ఆ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ ఏంటనే లాజిక్ మాట్లాడుతున్నారట! భారతదేశం తరఫున ఆడేందుకు ఒక క్రికెట్ జట్టును తయారు చేసుకోవాలంటే, రాష్ట్రానికో ఆటగాడు అందులో సభ్యుడిగా ఉండేలా చూడ్డం సాధ్యం కాదనీ, గెలిచే టీమ్ కూర్పు మాత్రమే ముఖ్యమనీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే అని ఓ ప్రముఖ నేత ఆఫ్ ద రికార్డ్ మీడియా ముందు చెప్పారట! ప్రభుత్వ పథకాలు, ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాలు మరింత సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలంటే ఆ ప్రయోజనాల కోణం నుంచే ఆలోచించాలనీ, ప్రస్తుతం మోడీ చేసింది కూడా అదే అనే సమర్థన వినిపిస్తోంది. అంటే, ఇప్పుడున్న జట్టు ఈ పనులను సమర్థంగా నిర్వహించడం లేదనే చెప్తున్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు కదా.
ఇక, దక్షిణాదిని చిన్న చూపు చూస్తున్నారనే వాదన లేవనెత్తితే… అలాంటిదేం లేదని కూడా ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. ఆంధ్రా కోటా నుంచి రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు, అలాగే నిర్మలా సీతారామన్ కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు వచ్చారనీ.. ఈ లెక్కన దక్షిణాది రాష్ట్రాలవారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టా లేనట్టా అనే లాజిక్ వినిపిస్తున్నట్టు సమాచారం! అయితే, సురేష్ ప్రభు ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకుడు కాదు కదా! గతంలో కర్ణాటక నుంచి వెంకయ్య నాయుడు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తే.. ఆయన్ని ఆంధ్రా నేతగానే చూశారు తప్ప, వేరే రాష్ట్రానికి ప్రతినిధిగా వారే చూడలేదు కదా! అలాంటప్పుడు ఈ లాజిక్ ని తెరమీదికి ఎలా తెస్తారు..? మిత్రపక్షాలతోపాటు, స్వపక్షం నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్న ఈ తరుణంలో కొత్త లాజిక్ తీసుకొచ్చి కాసేపు అలాంటి నోళ్లు మూయించగలరు. కానీ, దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు భాజపా సర్కారు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయం మరోసారి కాస్త చర్చనీయం అవుతోంది! సొంత పార్టీ నేతల నుంచే ఇలాంటివి వినిపిస్తుంటే… వారితో మున్ముందు ఎలా పనిచేయించుకుంటుందనే ప్రశ్న కూడా ఉంటుంది కదా!