‘బాలయ్యతో మళ్లీ మళ్లీ పనిచేయాలనివుంది’ అని పూరి జగన్నాథ్ ఇప్పటికే చాలాసార్లు చెప్పేశాడు. ఆ అవకాశం… జెట్ స్పీడులో వచ్చేసింది. బాలకృష్ణతో పూరి కాంబినేషన్‌కి మళ్లీ రంగం సిద్ధమైంది. బాలయ్య 101 ‘పైసా వసూల్’కి పూరినే దర్శకుడు. 102వ సినిమా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. 103వ సినిమా కోసం బాలయ్య మళ్లీ లైన్లోకి వచ్చేశాడు. బాలయ్య తో మరో సినిమా చేస్తున్నా.. 103వ సినిమాకి నేనే దర్శకుడ్ని అంటూ పూరి డిక్లేర్ చేసేశాడు. ”బాలయ్యతో మరో సినిమా చేస్తున్నా. పైసా వసూల్ రిజల్ట్ ఎలా ఉన్నా.. మనం ఓ సినిమా చేద్దాం.. వెంటనే మొదలెట్టేద్దాం అని బాలయ్య తొందర పెడుతున్నారు. నేనే కాస్త సమయం అడిగా. 2018 జనవరిలో ఈ సినిమా మొదలవుతుంది. కథ లాంటిదేం అనుకోలేదు. ఆయనకు కనీసం లైన్ కూడా చెప్పలేదు. మా నుంచి మరో సినిమా వస్తుందంతే…” అని క్లారిటీ ఇచ్చేశాడు పూరి.
నిజానికి బాలయ్య 103వ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాలి. 2018 ఏప్రిల్, మేలలో బోయపాటి సినిమా పట్టాలెక్కుతుందనుకొన్నారంతా. అయితే.. బాలయ్య నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. ‘పైసా వసూల్’ సమయంలో పూరికి పడిపోయారు బాలయ్య. అందుకే వెనువెంటనే పూరికి మరో ఛాన్స్ ఇచ్చేశాడు. 2018 జనవరిలో బాలయ్య – పూరి సినిమా పట్టాలెక్కితే… బోయపాటి ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.