చిరంజీవి 151వ సినిమా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసి చాలాకాలమైంది. ఇప్పటికే… కాస్ట్ అండ్ క్రూ ఎవరో దాదాపుగా తెలిసిపోయింది. పరుచూరి వారి స్క్రిప్టు కూడా రెడీగా ఉంది. అయినా ఇప్పటి వరకూ రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. అందుకు కారణమేంటి?? సైరా సెట్స్‌లోకి వెళ్లడానికి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది?? అనే అనుమానాలు నెలకొన్నాయి. సైరా ఆలస్యానికి కారణం డైలాగులేనట. ఇప్పటికే బుర్రా సాయిమాధవ్ డైలాగ్ వెర్షన్ మొత్తం రాసిచ్చేశాడు. అయితే.. చివర్లో చిన్నపాటి మార్పులు అవసరమయ్యాయట. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. ఆ మాండలికంలో డైలాగులు ఎక్కువగా రాయాల్సివచ్చిందట. రాయలసీమ మాండలికం ఉన్న డైలాగులన్నీ మరోసారి రీ రైట్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డైలాగుల ఘట్టం ఓ కొలిక్కి వచ్చాక అంటే అక్టోబరు ద్వితీయార్థంలో సైరా సెట్స్‌లోకి వెళ్లబోతంది. దానికి తోడు సెట్ వర్క్ కూడా భారీగా ఉంది. స్వాతంత్రోద్యమం నాటి వాతావరణానికి అనుగుణంగా సెట్లని రూపొందించాల్సివుంది. అందుకు సంబంధించిన పనుల్లో ఆర్ట్ విభాగం తలమునకలై ఉంది. ఇప్పటికే ఓ కథానాయికగా నయనతార ఎంపికైంది. మరో నాయికగా ప్రగ్యా జైస్వాల్‌ని అనుకొంటున్నారు. అనుష్క ఎంట్రీ కూడా దాదాపుగా ఖాయమైపోయిందని తెలుస్తోంది. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు.