ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈసారి హాలీ డే ట్రిప్ కాదులెండి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) పై అధ్యయనం చేయడం కోసం వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఏఐ పరిశోధనలు చేస్తున్న పలువురు దిగ్గజాలను ఆయన కలుసుకుంటారట. నిజానికి, మనదేశంలో ఇంకా దీనిపై పెద్దగా అధ్యయనాలు జరగడం లేదు. చైనా లాంటి దేశాలు ఏఐ రీసెర్చ్ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంతకీ, ఉన్నట్టుండి రాహుల్ గాంధీ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారంటే… భారతీయ సాఫ్ట్ వేర్ రంగం స్థాయి పెంచాలని అనుకుంటున్నారట! కాంగ్రెస్ పార్టీ విజన్ డాక్యుమెంట్ లో ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను కూడా చేర్చబోతున్నారట. ఈ మధ్య నార్వే పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ, బయోటెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు సిలికాన్ వేలీకి వెళ్లి ఏఐ మీద అధ్యయనం చేస్తారు.
అంటే, వచ్చే ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు కావాల్సిన సాధనా సంపత్తిని తయారు చేసుకునే క్రమంలో రాహుల్ ఉన్నారని చెప్పొచ్చు. ఈ అధ్యయనం మంచిదే. కానీ, మనదేశంలో చేయాల్సిన అధ్యయనాలు కూడా కొన్ని ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ ఓటమికి కారణమేంటో రాహుల్ అధ్యయనం చేయాలి. మోడీ హవా వల్ల మాత్రమే కాంగ్రెస్ ఓడిపోలేదు! కాంగ్రెస్ పై దేశవ్యాప్తంగా ప్రజలకు వచ్చిన విసుగు వల్ల మోడీ ప్రత్యామ్నాయం అయ్యారు. అప్పటికే పెద్ద ఎత్తున కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ నేతలపై వచ్చాయి. 2జీ, బొగ్గు కుంభకోణం వంటివి దేశాన్ని కుదిపేశాయి. దీంతో ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం పోయింది. ఈ పరిస్థితుల్లో భాజపా పుంజుకుంది. ఇప్పటికైతే మోడీ సర్కారుపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. దీన్ని దాటి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ప్రజలు ఎందుకు అనుకోవాలి..? బయోటెక్నాలజీపైనా, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పైనా ఏవో కొన్ని హామీలు ఇస్తే సరిపోతుందా..? వాటికంటే మోడీ సర్కారు వైఫల్యాలపై రాహుల్ అధ్యయనం చేస్తే బాగుంటుంది.
దేశ ప్రజలను నిలువునా కష్టాల్లోకి నెట్టేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ పోరాడిందేం లేదు! ఎన్నో కష్టనష్టాలకు కారణమైన ఆ నిర్ణయంతో మోడీ సర్కారు సాధించిందేం లేదు. మోడీ సర్కారు భారీ వైఫల్యం ఇది. దీన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ సమర్థంగా తీసుకెళ్లలేకపోతోంది. ఇక, రాష్ట్రాలవారీగా చూసుకుంటే… అధికారంలోకి రావడం కోసం భాజపా చేస్తున్న రాజకీయమేంటో చూస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ లో భాజపా చేసిన రాజకీయంపై అందరూ ముక్కున వేలేసుకున్నారు. తమిళనాడులో రాజకీయ అస్థిరతకు కారణం ఎవరు..? బీహార్ లో అధికారం దక్కించుకోవడం కోసం లాలూ కుటుంబంపై కక్ష కట్టిందెవరు..? ఇలా అధికారం కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధమౌతున్న భాజపా తీరుపై రాహుల్ అధ్యయనం చేస్తే బాగుంటుంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తే పార్టీకి ఎంతోకొంత మేలు జరుగుతుంది. అంతేగానీ, విదేశాలూ టెక్నాలజీలూ అంటూ ఈ సమయంలో పర్యటనలు పెట్టుకోవడం సరైన వ్యూహం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం.