రాష్ట్రంలో ఎక్కడా లేనిదీ పాత కరీం నగర్ జిల్లా పరిధిలోనే వరుసగా అనేక దుర్ఘటనలు, వివాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారట. మంధనిలో దళిత యువకుడు ప్రేమించిన నేరానికి చిత్రహింసల పాలైనాడు. తర్వాత అల్గనూరులో ఏదో సాకుతో దళితులపై చిత్ర హింసలు సాగాయి. నేరెళ్లలో ఇసుకలారీపై దాడికి గాను దళితులతో సహా స్థానికులను హింసించడం పెద్ద దుమారం రేపింది. తాజాగా గూడెం గ్రామంలో దళితులకు భూ పంపిణీలో అన్యాయం జరిగిందంటూ పరుశురాములు, మహంకాళి శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు ఆత్మాహుతికి ప్రయత్నించారు. తాము సమస్య ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఆయన కార్యాలయం ఎదుటే ఈ నిరసన చర్యకు తలపడ్డారు. ఈ నేపథ్యంలో వారి చికిత్సకు చర్యలు తీసుకోవడంతో పాటు అసలు ఈ ప్రాంతంలోనే ఇన్ని ఘటనలు అవి కూడా హరిజనులకు సంబంధించి ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని కెసిఆర్ పురమాయించారట. ఇదే సమయంలో ఆర్థిక మంత్రి రాజేందర్ మాత్రం పాలక పక్షంలో గ్రూపు తగాదాల వల్లనే ఈ ఆత్మాహుతి ప్రయత్నం జరిగిందని చెప్పారు. నిజం చెప్పాలంటే టిఆర్‌ఎస్ అంతర్గత తగాదాల్లో అధినేత రాజేందర్‌పై ఎప్పుడూ కాస్త కినుకగానే వుంటారు. హరీష్ రావును వారసత్వ పోటీ నుంచి తప్పించడం గురించి చెబుతుంటారు గాని రాజేందర్ కూడా తర్వాతి స్థానంలోనే వుంటారు. గతంలో సభా నాయకుడుగా తర్వాత కీలక శాఖ మంత్రిగా వనరులు గల బిసి నాయకుడుగా రాజేందర్ ఒక ప్రత్యేక స్థానం పొందారు. అనేక సందర్బాల్లో ఆయనకు ఇబ్బంది కర పరిస్థితులు ఎదురైనా ఎలాగో నెట్టుకువస్తున్నారు. గూడెం సంఘటన గ్రూపు తగాదాల పలితమని నేరుగా చెప్పడంలో ఆయన అసంతృప్తి తెలుస్తుంది. బహుశా ఈ సమస్యపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి భావించడంలోనూ అలాటి భావనే వుంటుందని పరిశీలకులు అంటున్నారు.