చంద్రబాబు బాలయ్య(బాబు) కావడానికి వియ్యంకులూ అంతకన్నా ముందు బావ మరుదులే గాని వారి మధ్య గడబిడ లేదని కాదు. అమ్మాయి బ్రాహ్మణిని నారా వారి కోడలిని చేశాక కూడా బాలయ్యను మేనేజ్ చేయడం కష్టమని చంద్రబాబు సన్నిహితులు చెబుతుండేవారు. జాతకరీత్యా ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావలసిందేనని ఆస్థాన జ్యోతిష్యులు చెప్పిన మాటలు ఆయనను తొలుస్తూ వుండేవంటారు. ఎంఎల్ఎ అయ్యాక కూడా ఈ ధోరణి వుంటూనే వచ్చిందట. మంత్రిగా చేరి తీరాలని కూడా ఒత్తిడి చేస్తుంటే అటు లోకేశ్ ఇటు బాలయ్య ఇద్దరినీ తీసుకోవడం సాధ్యం గాదు గనక రెండూ వాయిదా పడుతూ వచ్చాయి. నెమ్మదిగా ఆయనకు నచ్చజెప్పి అల్లుడినే అమాత్యుడిని చేయడంతో ఆ ఘట్టం ముగిసింది. ఈ లోగా నటుడుగానూ బాలయ్యకు కొన్ని విజయాలు విశేషాలు సంభవించాయి గనక అటు ఆసక్తి పెరిగింది. పైగా అభిమానుల పట్ల ప్రవర్తన, హిందూపురం నియోజకవర్గంలో అంతర్గత సమస్యలు కూడా ఇరకాటం తెచ్చాయి. ఏమైతేనేం అన్నీ సర్దుకున్నారట. గతంలో ముఖ్యమంత్రి అవుతారా అంటే చూద్దాం దేవుడి దయ లాటి గంభీరమైన సమాధానాలు దాటవేత జవాబులు చెప్పే నందమూరి హీరో తాజాగా తనకు అలాటి ఆశలు లేవని సంతోషంగా వున్నానని చెప్పడం ఇందుకు నిదర్శనం. హిందూపురం పర్యటనలో అనుయాయుల మధ్య స్థానిక నేతల మధ్య ఐక్యత కోసం ఒత్తిడి తేవడంలో కూడా సర్దుబాటు తత్వమే కనిపిస్తుంది. సో.. బావయ్యకు ఒక తలనొప్పి తగ్గినట్టేనా?