నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు.. కాకినాడ కార్పొరేషన్ కైవసం.. దీంతో తెలుగుదేశం శ్రేణులు మాంచి జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. నంద్యాలలో మహా అయితే ఓ పదివేల మెజారిటీతో గట్టెక్కేస్తాం అని టీడీపీ నేతలు అంచనా వేశారు. కానీ, అక్కడ అనూహ్యంగా 28 వేల మెజారిటీ రావడం టీడీపీకి కూడా అనూహ్యమే. ఇక, కాకినాడ కార్పొరేషన్ విషయానికొస్తే… దాదాపు మూడు దశాబ్దాల తరువాత తెలుగుదేశం కైవసం అయింది. ఇది కూడా ఒక రకంగా చారిత్రక విజయమే. దీంతో టీడీపీ శ్రేణులన్నీ ఉత్సాహంతో ఉన్నాయి. నేతలందరూ మరింత జోష్ లో మునిగి తేలుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడో కాస్త అసంతృప్తి ఫీల్ అవుతున్నారంటూ ఓ మీడియాలో కథనం వచ్చింది! ఆ కథనంలో సన్నాయి నొక్కలు ఏ స్థాయిలో ఉండాలో అంతకుమించే ఉన్నాయి. ఇంతకీ, ఆ కథనంలో ద్వారా చంద్రబాబు అసంతృప్తిని ఎలా చూపించారంటే… ఆయన స్థాయిని మరింత పెంచారు.
ఆ కథనం ప్రకారం చంద్రబాబు అసంతృప్తికి కారణం ఏంటంటే… నంద్యాల, కాకినాడలో పార్టీ పరంగా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనీ, ప్రభుత్వం తరఫున చేయాల్సిన కృషి మిగిలే ఉందని అభిప్రాయపడ్డారట! ముఖ్యంగా కాకినాడ విజయం గురించి ఆయన మాట్లాడుతూ… అక్కడ మరో మూడు స్థానాలు గెలిచే అవకాశం మనకు ఉందనీ, అభ్యర్థుల ఎంపికలో చిన్నచిన్న పొరపాట్ల వల్ల వాటిని చేజార్చుకున్నామన్నారట. అయితే, ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎన్నికల షెడ్యూల్ ను కమిషన్ ప్రకటించేయడంతో కాస్త ఇబ్బందిగా మారిందని టీడీపీ నేతలు కొందరు అభిప్రాయపడ్డారట. ఇవన్నీ ముందుగానే పరిగణనలోకి తీసుకుని మరింత కృషి చేస్తే బాగుండేదని చంద్రబాబు అన్నారట. ఓ పక్క పార్టీ శ్రేణులన్నీ ఇంత సంతోషంతో ఉంటే.. చంద్రబాబులో ఒకింత అసంతృప్తిపై కూడా టీడీపీ నేతలు మాట్లాడారనీ… ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన అలానే ఉండాలనీ, ఆ కొద్దిపాటిని అసంతృప్తిని ఈజీగా అర్థం చేసుకోగలమని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారట.
ఇదండీ ఆ కథనం సారాంశం. అంటే, నంద్యాల, కాకినాడలో టీడీపీ సాధించిన విజయాలకు ఇతర నేతలందరూ సంతోషిస్తారుగానీ… పార్టీ అధ్యక్షుడు స్థాయి నేత, అదీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికి ఇలాంటివి పెద్దగా సంతృప్తిని ఇవ్వవనేది చెప్తున్నట్టుగా ఉంది. అంటే, ఇతర పార్టీ నేతలతో పోల్చితే ఆయన స్థాయి అంత పైకి ఉంటుందనీ, ఆయన సంతృప్తి పడాలంటే ఈ విజయాలు సరిపోవని చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. ఇలాంటి కథనాలు వారికే సాధ్యం. లేకపోతే.. నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే చంద్రబాబు సంతృప్తి చెందరా..? కాకినాడ కార్పొరేషన్ దక్కితే ఇంకా మూడు స్థానాలు రాలేదని చంద్రబాబు బాధపడుతున్నారా..? ఏమో… ఆ మీడియా వర్గాలకే తెలియాలి.