బెల్లం చుట్టూ ఈగలు, హిట్ల చుట్టూ ప్రొడ్యూసర్లు చేరడం కామన్. దాన్ని తప్పుపట్టలేం కూడా! చేతిలో విజయాలున్నప్పుడే ఆదరణ. విజయాలు మొహంచాటేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కూడా లైట్ తీసుకొంటారు. ఇప్పుడు అల్లరి నరేష్ విషయంలో ఇదే జరుగుతోంది. ఒకప్పుడు చేతిలో ఎప్పుడూ నాలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేవాడు నరేష్. యేడాదికి కనీసం నాలుగు సినిమాలైనా వచ్చేవి. అందుకే… నరేష్ అతి తొందరగానే 50 సినిమాల మైలు రాయి అందుకొన్నాడు. అయితే ఆఖరి పాతికలో హిట్లు ఒకటో రెండో ఉన్నాయంతే. దాంతో.. నరేష్ కెరీర్ ఒక్కసారిగా కుదేలైంది. మధ్యలోనిర్మాతగా మారి ప్రయత్నాలు చేసినా అవేం సరైన ఫలితాల్ని అందించలేదు. కాస్త విరామంతో ‘మేడమీద అబ్బాయి’గా వస్తున్నాడు. ఈసినిమాకీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమాత్రం జరగలేదు. శాటిలైట్ అయినా.. ఇప్పటి వరకూ టీవీ ఛానల్ వాళ్లు డబ్బులు ఇవ్వలేదంటే నరేష్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు.
మేడమీద అబ్బాయి వచ్చి వెళ్లిపోతే.. నరేష్ పరిస్థితి ఖాళీనే. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నా వాళ్లు కూడా మేడమీద అబ్బాయి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నార్ట. ఈ సినిమా హిట్టయితే … నరేష్‌కి అడ్వాన్స్ ఇద్దాం అని కాచుకొని కూర్చున్నారు. అటూ ఇటూ అయితే… ఆ ఇద్దరూ గాయబ్! నరేష్ కెరీర్ మరో పది సినిమాల పాటు సాగాలంటే.. మేడమీద అబ్బాయి హిట్ కొట్టడం కంపల్సరీ. నరేష్లాంటి నటుడికి విజయాలు దక్కాల్సిందే. ఎందుకంటే ఓ హిట్టు కొడితే తానొక్కడే బిజీ అవ్వడు. తనతో పాటు వందమందికి ఉపాధి కల్పిస్తాడు. కాకపోతే.. కథల ఎంపికలో తప్పు చేస్తున్నాడు.ఎప్పుడూ మూస పద్ధతిలోనే సినిమాలు తీస్తున్నాడు. జనరేషన్ మారింది. వాళ్లకు కావల్సిన కామెడీ కూడా మారింది. ఈ విషయాన్ని నరేష్ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.