రాజకీయ పక్షాలూ అందులోనూ అధికార పక్షంలో వున్నవారు అతిశయోక్తులు చెప్పడం ద్వారా అవతలి వారిని అదరగొట్టడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. తమ బలాన్ని ఎక్కువగా చూపించడం ద్వారా వారి మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడం ఇక్కడ వ్యూహం. అయితే అతిశయాలకు కూడా హద్దు వుంటుంది. కాని ఆంధ్ర ప్రదేశ్ షెహన్షా లోకేశ్ బాబు మాత్రం ఆకాశమే హద్దంటున్నారు.వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ టిడిపినే గెలుస్తుందని జోస్యం చెప్పేశారు. ప్రతిపక్ష నేత పోటీ చేసే పులివెందుల కూడా వదలరా అని ఆ ఛానల్ విలేకరి అడిగితే అదేం లేదు పొమ్మన్నారు. ఆ విలేకరి ఒకటికి నాలుగు సార్లు ఇది అతిగా వుందని చెప్పడానికి ప్రయత్నించినా లోకేశ్ తన పల్లవి మార్చుకోలేదు. దానికి ముందు 175 నియోజకవర్గాల్లో పెన్షన్లు ఇచ్చామనీ, 175 చోట్ల రుణమాఫీ చేశామని ఇలా ఆ సంఖ్యను పదేపదే స్మరించారు. అంటే ఇది వ్యూహాత్మకంగా అంటున్న మాట తప్ప యాదృచ్చికం కాదనేది స్పష్టం. విజయవాడ భవానీపురంలో లోకేశ్ జలసిరి కార్యక్రమంలో పాల్గొని హారతి ఇచ్చాక ఈ సీట్లసిరి కనిపించింది. కృష్ణవేణమ్మ అంతా వింటూనే వుంటుంది మరి! ఇదే ఖాయమైతే అసలు ఎ న్నికల ఖర్చు తప్పించేసి ముందే ఏకగ్రీవం చేస్తే పోతుంది కదా.. లంకలో మరియాలు తాటికాయంత అన్నట్టు ఒకవేళ సీట్ల సంఖ్య 225 కు పెంచితే అవి కూడా తమకే వస్తాయని వాకృచ్చారు యువరాజుల వారు. బ్రేవో!