శుక్రవారం విడుదలైన యుద్దం శరణం సినిమాని ఫ్లాపుల లిస్టులో చేర్చేశారు ట్రేడ్ వర్గ నిపుణులు. ఈ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. శని, ఆదివారాలు ఎలా ఉంటాయో చూడాలి. కథ, కథనం విషయంలో పాత చింతకాయ పచ్చడి ఫార్ములాని అనుసరించింది చిత్రబృందం. డ్రోన్ కెమెరా అనే ఎలిమెంట్ ఉన్నా – దాన్ని సమర్థవంతంగా వాడుకోలేదు. దాదాపుగా సగం ఏరియాల్లో వారాహి సంస్థ సొంతంగా విడుదల చేసుకొంది. పబ్లిసిటీ కూడా పెద్దగా చేయలేదు. బహుశా ఈ సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసినా అనవసరమే అనుకొన్నారో ఏమో! మీడియా ఇంటర్వ్యూలు, యాడ్ల విషయంలో పిసినారి తనం చూపించేశారు. నిజానికి ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కించాల్సింది. సురేష్ బాబు తెలివైన వాడు కాబట్టి.. కథ విని `మనకు వర్కవుట్ అవ్వదులే` అని వదిలించుకొన్నాడు. కాకపోతే.. సురేష్ బాబు అతి తెలివితేటలకు.. సాయికొర్రపాటి బలైపోయాడు అంతే.. తేడా! కథ బాగుంటే నాగార్జున తన సొంత సంస్థలోనే ఈ సినిమా తీసేవాడు. పైగా పబ్లిసిటీ కూడా భీకరంగా చేసేవాడు. నాగ్ ఈ కథ విని లైట్ తీసుకొన్నాడంటేనే… యుద్దం శరణం ఫలితంపై సురేష్‌బాబు, నాగార్జునలకు ముందే ఉప్పు అందేసిందని అర్థం అవుతోంది. ఏ సినిమాని చేయాలో తెలుసుకోవడం కాదు, ఏ సినిమాని వదిలేయాలో కూడా తెలిసుండాలి. పాపం.. ఈ విషయంలో సాయికొర్రపాటి బాగా వీక్ అనుకొంటా.