నారా రోహిత్, నాగశౌర్య సినిమా కథలో రాజకుమారి పూర్తయి చాలా కాలం అయ్యింది. విడుదల తేదీ చెప్పమంటే ఇదిగో.. అదిగో అంటున్నారు. ఈ సినిమా క్రమంగా మర్చిపోయే స్థితికి తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. సినిమా బాగా వచ్చిందట. కానీ.. ప్రమోషన్ భారీ ఎత్తున చేసుకోవడానికి తగిన ఆర్థిక స్థోమత లేక ఈ సినిమా విడుదలకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. ఏ సురేష్‌బాబు లాంటివాడో, దిల్‌రాజు లాంటి నిర్మాతో ఈ సినిమాని కొని… విడుదల చేయకపోతాడా అని ఆశలు పెట్టుకొంది చిత్రబృందం. ఇప్పటికే సురేష్‌బాబుకి ఈ సినిమా చూపించార్ట. దిల్‌రాజు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెంటల్ మదిలో అనే సినిమాని విడుదల చేయడానికి సురేష్‌బాబు ముందుకొచ్చాడు. ఓ సినిమా చేతిలో ఉండగా, మరో సినిమాని ఆయన పట్టించుకోడు కాబట్టి… కథలో రాజకుమారి ఆశలన్నీ దిల్‌రాజుపైనే ఉన్నాయి. దిల్ రాజు ఓకే అంటే.. ఈ నెలలోనే ఈ సినిమాని చూడొచ్చు. నిజానికి ఓ సినిమాని విడుదల చేయడం దిల్‌రాజులాంటి వాళ్లకు లాభసాటి వ్యాపారమే. సినిమా బాగుంటే.. లాభాల్లో వాటా తీసుకొంటారు. పోతే… చేతిలోంచి పైసా పోదు. `పెళ్లి చూపులు` సినిమాకి సురేష్‌బాబు పెట్టుబడి పెట్టలేదు. కానీ.. లాభాల్లో వాటా దండుకొన్నాడు. ఈమధ్య వెళ్లిపోమాకే అనే సినిమాని విడుదల చేశాడు దిల్‌రాజు. దానికి సరైన ప్రచారం కూడా చేయలేదు. సినిమా ఫలితం కూడా దానికి తగ్గట్టే వచ్చింది. మరి.. రాజకుమారిపై దిల్‌రాజు మనసు పెడతాడో, లేదో చూడాలి.