2018 సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగబోతోంది. పవన్ కల్యాణ్ ఇప్పటికే సంక్రాంతి రేసులో దిగబోతున్నట్టు ప్రకటించాడు. నందమూరి బాలకృష్ణ – కె.ఎస్.రవికుమార్ సినిమా కూడా సంక్రాంతికి వచ్చేస్తోంది. మహేష్ – కొరటాల శివ.. భరత్ అను నేను కూడా సంక్రాంతి బరిలో దిగబోతోంది. రంగస్థలం కూడా ఈ ముగ్గుల పండక్కే విడుదల చేద్దామనుకొన్నారు. కానీ సంక్రాంతి పోటీ దృష్ట్యా చరణ్ సినిమా తప్పుకోవాల్సివచ్చింది. సంక్రాంతికంటే ముందే విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి.. రంగ స్థలంని వేసవిలో వదులుతారు అనుకొన్నారంతా. అయితే.. సుకుమార్ మాత్రం ఈసినిమాని సంక్రాంతికే వదలాలని ఫిక్సయ్యాడట. మహేష్ – కొరటాల సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదన్న స్పష్టమైన సంకేతాలు రంగస్థలం టీమ్‌కి అందినట్టు సమాచారం. మహేష్ రాని పక్షంలో.. రంగస్థలం విడుదలకు ఎలాంటి అడ్డూ ఉండదని చిత్రబృందం భావిస్తోంది. అయితే పవన్ సినిమా విడుదలకు వారం రోజుల వ్యవధి తీసుకొనే రంగస్థలంని విడుదల చేస్తార్ట. అంటే జనవరి తొలివారంలో గానీ, మూడో వారంలో గానీ.. రంగ స్థలం రాబోతోందన్నమాట. మహేష్ మనసు మార్చుకొంటే మాత్రం.. రంగస్థలం యధావిధిగా వాయిదా పడడం తథ్యం. రంగస్థలం వస్తుందా, రాదా?? అనేది ఇప్పుడు మహేష్ – కొరటాల శివ చేతుల్లో ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే భరత్ అను నేను సంక్రాంతికి విడుదల కావడం అసాధ్యమనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికి 20 శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. మేజర్ షెడ్యూల్ అక్టోబరు – నవంబరు మాసాల్లో జరగబోతోంది. కాబట్టి… మహేష్ సినిమా కోసం వేసవి వరకూ ఎదురుచూడాల్సిందే.