ప్రతీ రాజకీయ పార్టీకి ఏదో ఒక మీడియా సంస్థ అండ నిలవడం అనేది సర్వసాధారణ విషయమైపోయింది. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, వారి అవసరాలకు పెద్ద పీట వేయాలి… లాంటి లక్ష్యాలు నెమ్మదిగా ద్వితీయ ప్రాధాన్యాంశాలుగా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఒక పార్టీ గొంతును వినిపించడం కోసం, ఆ పార్టీ కార్యకలాపాలను ప్రజలకు తెలపడం కోసం, ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలూ విమర్శలూ చర్చలూ రచ్చలూ ఇవన్నీ పొల్లుపోకుండా జనంలోకి గుమ్మరించడమే లక్ష్యంగా పార్టీ పత్రికలు ఉంటాయనడంలో సందేహం లేదు. తెలంగాణలో ఇప్పటికే తెరాసకు అండగా నిలిచే తమదైన మీడియా సంస్థ ఉంది. ఇక, ఆంధ్రాలో టీడీపీకి ఎన్నో దశాబ్దాలుగా వెన్నుదన్నుగా ఉంటున్న ఓ ప్రముఖ పత్రిక కూడా.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక, తెలంగాణ వరకూ స్టాండ్ మార్చుకుంది. కేసీఆర్ కి జై అని పరోక్షంగా భజిస్తూనే ఉంది. పరిస్థితి ఇలా ఉంటే విపక్షాల పరిస్థితి ఏంటి..? అందుకే, టి. కాంగ్రెస్ కూడా సొంత మీడియాను పెట్టబోతోంది!
కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ఒక పత్రిక, ఒక న్యూస్ ఛానెల్ రాబోతున్నట్టు టి.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలనీ, సోషల్ మీడియాలో కూడా క్రియాశీల పాత్ర పోషించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి 90 సీట్లు రాబోతున్నాయనీ, కేసీఆర్ కల్లబొల్లి కబుర్ల వెనక నాటకాలన్నీ త్వరలోనే బహిర్గతం అవుతాయనీ, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. నిజానికి, తమ కార్యకలాపాలను మీడియా పట్టించుకోవడం లేదంటూ తరచూ కాంగ్రెస్ నేతలు వాపోతూ ఉండేవారు. ఇన్నాళ్లకు ఆ సమస్య తీరబోతున్నట్టే. సొంత పత్రిక, సొంత ఛానెల్.. పేజీల కొద్దీ కథనాలు వేసుకున్నా, గంటలకొద్ది లైవ్ లు పెట్టుకున్నా అడిగేవారు ఎవరుంటారు..?
అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ఇది ఉత్తమ్ హయాంలో ప్రారంభం కాబోతున్న మీడియా సంస్థ. అంటే, ఆ పత్రిక, ఛానెల్ పై ఉత్తమ్ అజమాయిషీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఉత్తమ్ అంటే గిట్టనివాళ్లు, ఆయన్ని పీసీసీ నుంచి తప్పించాలని ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నవారూ టి. కాంగ్రెస్ లో ఉన్నారు కదా! అలాంటివారికి ఈ మీడియా ప్రాధాన్యత కల్పిస్తుందని అనుకోలేం. మీడియాను చేతిలో పెట్టుకుని వారిని దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు! అంటే, ఆ మీడియాపై కూడా టి. కాంగ్రెస్ నేతల్లో కొత్త పంచాయితీ ఉండదని మాత్రం చెప్పలేం. ఏదేమైనా, వ్యక్తిగతంగా ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్లస్ కాబోతున్న నిర్ణయంగానే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సోనియా, రాహుల్ ఆశీస్సులు ఆయనకి బాగానే ఉన్నాయని అంటుంటారు. ఇప్పుడీ మీడియా ప్రారంభంతో వారి దృష్టిలో మరిన్ని మార్కులు పడతాయి కదా!