తెలుగులోకి అడుగుపెట్టిన పరాయి భామలు, పక్క హీరోలు.. వచ్చీ రాని తెలుగులో తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారు. అయితే మన మహేష్ అలా కాదు. తను తొలిసారి తమిళంలో నటించాడు. స్పైడర్ తో తమిళంలోకి నేరుగా ఎంట్రీ ఇచ్చాడు. తమిళ వెర్షన్‌కి సంబంధించిన డబ్బింగ్ తానే చెప్పుకొన్నాడు. ఇప్పుడు తమిళ స్పీచ్ అదరగొట్టేశాడు. స్పైడర్ ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. అక్కడే తెలుగు, తమిళ పాటల్ని ఒకేసారి విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడాడు. ఎక్కడా ఒక్క మాట కోసం కూడా వెదుక్కోకుండా తమిళంలోనే స్పీచ్ ఇవ్వడం అక్కడి అభిమానుల్ని ఆకట్టుకొంది.
”పద్దెనిమిదేళ్ల కెరీర్లో తొలిసారి తమిళ సినిమా చేస్తున్నా. ఇదేదో తొలి సినిమా చేస్తున్నంత ఫీలింగ్ కలుగుతోంది. అందరూ ఇది నా తొలి తమిళ సినిమాగా చూస్తున్నారు. నాకైతే.. ఇదే తొలి సినిమా అనిపిస్తోంది. మురుగదాస్ తో సినిమా చేయాలన్నది పదేళ్ల కల. ఈమధ్య మేం చాలాసార్లు కలుసుకొన్నాం. సినిమా గురించి మాట్లాడుకొన్నాం. అప్పుడెప్పుడో ఓ కథ చెప్పారు. ఇప్పుడు అదే రెండున్నర గంటల సినిమాగా చేశారు. నీకెరీర్లో బెస్ట్ సినిమా ఏమిటి? అని అడిగితే నేను స్పైడర్ పేరే చెబుతా. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ లెక్కలేనంత అభిమానుల్ని సంపాదించుకొన్నా. ఈ జన్మకి ఇది చాలు… ఇంకేం కోరుకోవడం లేదు. ఓ సినిమాపై రూ.120 కోట్లు పెట్టారు నిర్మాతలు. ఇలాంటి సినిమా చేయడానికి గట్స్ ఉండాలి” అన్నాడు మహేష్ బాబు.