స్పైడర్‌తో తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు మహేష్ బాబు. తమిళంలో ఇదే తొలి సినిమా కాబట్టి, అక్కడ ప్రచారంపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే తెలుగు, తమిళ పాటల్ని చెన్నైలోనే విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శంకర్ అతిథిగా వస్తాడనుకొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల శంకర్ గైర్హాజరు కావాల్సివచ్చింది. ఈ ఆడియోకి తమిళ కథానాయకుడు విశాల్ అతిథిగా మారిపోయాడు. గెస్టులెవరూ పెద్దగా లేకపోవడంతో స్పైడర్ ఆడియో కాస్త డల్‌గా కనిపించింది. కాకపోతే.. తమిళ వాసులు మన మహేష్‌ని ఘనంగా స్వాగతించారు. ”మా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ని తెలుగులో సూపర్ హీరోని చేశారు. మీ సూపర్ స్టార్ మహేష్ బాబుని తమిళంలో అదే రీతిలో ఆదరిస్తాం” అని తెలుగు ప్రేక్షకులకు మాటిచ్చాడు ఎస్.జె.సూర్య.
విశాల్ కూడా మహేష్ గురించి గొప్పగానే చెప్పాడు. ”ఇక ఈ మహేష్ మా మహేష్” అంటూ మహేష్‌ని అప్పుడే తమ హీరోగా మార్చేసుకొన్నాడు. ”మహేష్ బాబు ప్రతీ సినిమానీ తొలి రోజు తొలి షో చూడడం నాకు అలవాటు. ఈ సినిమా కూడా ఫస్ట్ డే, ఫస్ట్ షో మహేష్ ఫ్యాన్స్ మధ్య కూర్చుని చూస్తా. తెలుగులో మహేష్ ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకొన్నాడో.. తమిళంలోనూ అదే స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకొంటాడు” అని విశాల్ చెప్పాడు. మహేష్‌లో ఓ హాలీవుడ్ హీరో కనిపిస్తాడని, ఒక్కో మహేష్ అభిమానీ ఈ సినిమాని పదేసి సార్లు చూస్తారని ఈ చిత్రానికి సంగీతం అందించిన హారీశ్ జయరాజ్ చెప్పాడు. ఆడిటోరియం దగ్గర కూడా మహేష్ అభిమానుల సందడి బాగా కనిపించింది. తెలుగులో మహేష్ ఆడియో విడుదల అయితే ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో, చెన్నైలోనూ అంతే రచ్చ చేశారు. ఇదే స్థాయిలో ఓపెనింగ్స్ కూడా ఉంటే… తమిళంలో మహేష్ జెండా పాతేసినట్టే.