నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించిన తరువాత, సీఎం చంద్రబాబును పార్టీపై మరోసారి దృష్టి పెట్టారు. సమన్వయ కమిటీలో పార్టీ ప్రక్షాళన దిశగా కొన్ని చర్యలకు దిగబోతున్నట్టుగానే సంకేతాలు ఇచ్చారు. పార్టీ పని చెయ్యనివారిని పక్కన పెట్టేస్తామంటూ ఎప్పటికప్పుడు ఆయన అంటూనే ఉంటారు. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నిక వరకూ చాలామంది నేతలు కూడా ఈ మాటల్ని లైట్ గా తీసుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే మాట చెబుతూ ఉండటంతో… చాలామంది నేతలకు టెన్షన్ మొదలైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా భేటీలో నియోజక వర్గాల ఇన్ఛార్జ్ ల గురించి మాట్లాడారు. పనితీరు ఆధారంగా ఇన్ఛార్జ్ ల మార్పులూ చేర్పులూ ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో కూడా ఇన్ఛార్జ్ లను నియమిస్తామని స్పష్టత ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వెయ్యాల్సిన కొన్ని కమిటీల నియామకం కూడా జరుగుతుందని ఈ భేటీలో చెప్పారు.
ఇదే సమావేశంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం గురించి కూడా చర్చించారు. పార్టీ శ్రేణులన్నీ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించాల్సి ఉంటుందన్నారు. ఇదేదో బల ప్రదర్శన కోసం చేపట్టిన కార్యక్రమంలా ప్రజలు అనుకోకూడదనీ, వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకోవడం, అర్హులై ఉండి ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అందకపోతే వెంటనే వారికి లబ్ధి చేకూర్చడం వంటి అంశాలపైనే ప్రధానంగా పార్టీ శ్రేణులు దృష్టి కేంద్రీకరించాలని చంద్రబాబు సూచించారు. ప్రజల సమస్యల్ని గుర్తించి, ఆ డాటాను వెంటనే పార్టీకి పంపించాలనీ, ఆ వెనువెంటనే చర్యలు ఉండాలని స్పష్టం చేశారు.
మొత్తానికి, తెలుగుదేశం శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే వ్యూహంలో చంద్రబాబు ఉన్నట్టు స్పష్టమౌతోంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలనే బాధ్యతను పార్టీ శ్రేణులకు బాగా తలకెక్కించారు. ఇదే సమయంలో పనిచెయ్యని వారిని ఇంటికి పంపించేస్తామంటూ కూడా చెప్పేస్తున్నారు. దీంతో ఉన్న పదవులు పోతాయనో, పార్టీ నుంచి తమను తప్పించేస్తారనో భయంతోనైనా అందరూ ఒకేలా పనిచేస్తారని చంద్రబాబు ఆశిస్తున్నట్టున్నారు. నిజానికి, నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిన వెంటనే చంద్రబాబు తీరు ఇలా మారుతుందని టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఈ గెలుపు ఆయనలో ధీమా పెంచి… పార్టీ నేతలపై ఒత్తిడి పెంచేలా వ్యవహరించడం మొదలుపెడతారని ఆ మధ్య కొన్ని అభిప్రాయాలు బయటకి వచ్చాయి! దానికి అనుగుణంగానే చంద్రబాబు తీరు ఉంటోందనీ, మున్ముందు పార్టీ నేతలపై ఇంకా ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఏదేమైనా, ఆయన చేసేది తెలుగుదేశం మరోసారి అధికారంలోకి రావాలనే కదా.. అనేవారు కూడా లేకపోలేదు.