కాంగ్రెస్ పార్టీకి కొత్త ఛానల్ పత్రిక వస్తాయని టిపిసిసి అద్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించారు. అప్పటి వరకూ సోషల్ మీడియాను చురుగ్గా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపైనా దాని నిర్బంధంపైనా విమర్శలు చేసే సందర్భంలో ఉత్తమ్ ఈ మాటన్నారు. అయితే అధికారికంగా చెప్పారు గనక అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. ఇది నిజంగా నిజమేనా? ఆ దిశలో ఏమైనా సన్నాహాలు జరిగాయా అని విచారిస్తే అదేమీ లేదంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులైన కోమటిరెడ్డి సోదరులు రాజ్న్యూస్ను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిపై ఆకాంక్ష ప్రకటించిన వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్న సంగతి అందరికీ తెలుసు. పైగా ఆయన ప్రస్తుత పిసిసి నాయకత్వంతో బహిరంగంగానే విభేదిస్తున్నారు కూడా. తాజాగా కాంగ్రెస్ సమావేశంనుంచి నిరసనగా వెళ్లిపోయారు.కనుక ఆయన ఛానల్ను రాజకీయంగా లెక్కేయడానికి లేదు. ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి ఐన్యూస్ ఛానల్ను నిర్వహిస్తున్నారు గాని ఆయన కాంగ్రెస్లో లేరు. త్వరలో చేరే అవకాశముందని ఒక మాట వినిపిస్తుంటుంది. ఆయనకు సన్నిహితుడైన ఎంఎల్సి రంగారెడ్డి ఒకప్పుడు ఎ1 అనే ఛానల్ను తీసుకున్నారు.ఇవన్నీ ఏ దశలో వున్నాయో తెలియదు. వాటిని దృష్టిలో పెట్టుకుని అన్నారా? లేక నిజంగా మరో సంస్థ ప్రారంభిస్తున్నారా? బహుశా ఇప్పుడున్న పరిస్థితిలో పూర్తిగా కొత్తదైన మరో ఛానల్ ఇప్పటికిప్పుడు రావడం కష్టమేనని అంచనా. పైగాఉత్తమ్ చాలా కాలంనుంచి అలా అంటూనే వున్నారట. కనుకనే సన్నిహితులు పెద్ద తీవ్రంగా తీసుకోవడం లేదు.