ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న జై లవకుశ ట్రైలర్ వచ్చేసింది. ఆడియో ఫంక్షన్లో అతిథులు చెప్పినట్టు… మూడు పాత్రల్లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించబోతున్నాడన్న విషయాన్ని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. జై, లవ, కుశ పాత్రల్ని పరిచయం చేస్తూ విడివిడిగా టీజర్లు వదిలారు. దానికి ఎక్స్‌టెన్షన్‌లా ఉంది ట్రైలర్. ”ఏ తల్లికైనా ముగ్గురు మగబిడ్డలు పుడితే రామలక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకొంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ తల్లికి పుట్టిన పుట్టిన బిడ్డలు రావణ రామ లక్ష్మణులయ్యారు” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. జై, లవ, కుశ పాత్రల్ని మరోసారి పరిచయం చేస్తూ… ఈ మూడు పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఏర్పడుతుందో ట్రైలర్లోనే ఓ క్లూ ఇచ్చేశాడు దర్శకుడు.
”నేను మహానటుడ్నని ఆడియన్స్‌లో పాజిటీవ్ రియాక్షన్ ఉందిరా…. అలాంటి నన్ను మీ ఎదవ పెర్ఫార్మ్సెన్సులు వేసేసి ఆడిటర్స్ ముందు ఇరికించేస్తార్రా…” అంటూ కుశ చెప్పే డైలాగ్, ఆ మేనరిజం… ఎన్టీఆర్ అభిమానులకు తెగ నచ్చేస్తాయి. అయితే.. ఇందులోనూ జై ఆధిపత్యమే కనిపించింది. ”మనమనేది అబద్దం.. నే.. నే.. నేనన్నదే నిజం”, ”ఘట్టమేదైనా, పాత్ర ఏదైనా నేను రె…. రె… రెడీ” అంటూ నత్తి నత్తిగా జై పలికే డైలాగులు ఈ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా మొత్తాన్ని జై పాత్ర ఒంటి చేత్తో మోసుకెళ్లబోతోందని చెప్పడానికి ఈ ట్రైలరే సాక్ష్యం. ముగ్గురు ఎన్టీఆర్‌లని ఒకేసారి తెరపై చూడడం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి విందుభోజనమే. అది ట్రైలర్ చివర్లో కనిపించింది కూడా. ఇక థియేటర్లో ఆ సందడి ఎలా ఉంటుందో..??