హైదరాబాద్: నిన్న ఓ వార్త కవరేజిలో చేసిన పొరపాటుకు సాక్షి దినపత్రిక క్షమాపణ చెప్పింది. ఆ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. నిన్న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్ కాలనీలో తొమ్మిదేళ్ళ పాప ఒక సూదితో ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న సురేష్ అనే యువకుడు గమనించి ఆ సూదిని పాపదగ్గరనుంచి తీసుకుని పారేశారు. తర్వాత పాపను ఆమె తల్లికి అప్పగించారు. పాపకు సూది గుచ్చుకుందేమోనని తల్లి ఆసుపత్రికి తీసుకెళుతుండగా చుట్టూ గుమిగూడిన స్థానికులు సురేష్‌ను సూది సైకోగా భావించి చితకబాదారు. సురేష్ తన ఫ్రెండ్‌కు ఫోన్ చేయగా అతను అక్కడికి చేరుకుని తమ వివరాలు తెలిపారు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు సురేష్, అతని ఫ్రెండ్‌ను పోలీస్ జీప్ ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్ళారు. తీరా విచారిస్తే వారిద్దరూ అలాంటివారు కాదని పోలీసులకు తెలిసింది. ఈ వార్తకు సంబంధించి సాక్షి పేపర్లో సురేష్ ఫ్రెండ్ ఫోటోను అనుమానితుడిగా పేర్కొంటూ ప్రచురించారు. దీనికిగానూ ఇవాళ క్షమాపణ చెబుతూ హైదరాబాద్ ఎడిషన్ మూడోపేజిలో ఒక వివరణ ఇచ్చారు. అదీ సంగతి!
కానీ నిజంగా సాక్షి క్షమాపణ చెప్పాల్సిన సంగతి మరొకటుంది. ఇండియాలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండవస్థానంలో ఉన్నట్లు ప్రపంచబ్యాంక్ ఒక నివేదికలో పేర్కొన్న వార్తను – ‘వ్యాపారాలకు గుజరాత్ టాప్’ అనే హెడ్డింగ్ ఇచ్చి ఏపీకి దక్కిన ఘనతను తక్కువగా చేసి చూపినందుకు సాక్షి క్షమాపణ చెప్పాలి. మీకూ-టీడీపీకి పార్టీల పరంగా ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలిగానీ, ఆ కక్షను రాష్ట్రంపై చూపటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. సాక్షి మీడియాకు, దాని వెనక ఉన్న పార్టీకి రాష్ట్రం ముఖ్యమా – అధికారం ముఖ్యమా అనే సందేహంకూడా ఏర్పడుతోంది.