ఇటీవలే మనం చెప్పుకున్నట్టుగా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి లోకేశ్ రాష్ట్ర శాసనసభలో స్థానాలన్నీ తమకే వచ్చేస్తాయని ప్రకటించారు. అన్నినియోజకవర్గాల్లోనూ అవే పథకాలు అమలు చేయడమే కారణమని వివరించారు.ఉప ఎన్నికల కోసమో స్థానిక ఎన్నికల కోసమో మొత్తం ఒకచోట గుమ్మరించవచ్చు గాని ఒక ప్రభుత్వం కొన్ని చోట్ల మాత్రమే ఒక పథకం అమలు చేసి కొన్ని చోట్ల మానేసే అవకాశముందేమో తెలియదు. కాని అంత తర్కం ఆయనకు అవసరం లేదు కదా.. మొత్తానికి ఎసరు పెట్టేస్తే ఇక ప్రతిపక్షం బెడదే వుండదని కోరుకోవడంలో తప్పు లేదు. అయితే తర్వాత కొంత పునరాలోచన చేసినట్టున్నారు. జనాభాలో 75 శాతం తమతో వున్నారని విశాఖలో కొత్త ప్రకటన చేశారు. అంటే సీట్లు నూరుశాతం వస్తాయి గాని ఓట్లు నూరుశాతం అంటే బావుండదని గుర్తించారన్న మాట. కొంతలో కొంత వాస్తవికత మంచిదే. అయితే ఇప్పటికి 25 శాతంగా వున్న అసంతృప్తి రేపు విస్తరించదన్న గ్యారంటీ ఏముంటుంది? పైగా ఈ 25 శాతం అన్నిచోట్ల ఒకే విధంగా పరుచుకుని వుండదు. కొన్నిచోట్ల ఎక్కువ కొన్ని చోట్ల మరింత ఎక్కువ వుండొచ్చు. ఆ బాగా ఎక్కువ వ్యతిరేకత వున్నచోట్టనే పార్టీలు ఓడిపోతుంటాయి కనుక రాజకీయ ప్రచారం కోసం మరీ అతిశయాలు చెప్పుకోకపోవడం మంచిది కదా! ఇంతకూ ఈ సందర్భంగా చినబాబు ప్రసంగానికి ముగ్దులైపోయిన తెలుగు తమ్ముళ్లు తమ పరవశాన్ని సోషల్ మీడియాలో భజనలుగా పంచుకోవడం కొసమెరుపు.