కథకుడు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీవల్లీ. ఈ సినిమాపూర్తయి చాలాకాలమైంది. అయితే.. విడుదలకు నోచుకోలేదు. సడన్ గా ఇప్పుడు ఈ సినిమాని బాక్సాఫీసు బరిలో దించుతున్నారు. ఈనెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రామ్‌చరణ్‌ని తీసుకొచ్చి.. కాస్త జనం దృష్టిలో పడింది శ్రీవల్లీ టీమ్. ఈ సినిమా కథకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా విజయేంద్రుడు పంచుకొన్నాడు. ఈ కథ విషాదం నుంచి పుట్టిందట. విజయేంద్రప్రసాద్‌కి రమేష్ అనే ప్రాణ స్నేహితుడు ఉండేవాడట. చాలాకాలం క్రిందటే… విజయవాడలో సెటిల్ అయ్యాడట. వినాయక చవితి పండగ రోజున రమేష్ బాగా గుర్తొచ్చాడట. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అనుకొన్నాడట విజయేంద్ర ప్రసాద్. కొన్నాళ్లకు విజయవాడ లోని రమేష్ ఇంటికి వెళ్తే..వినాయక చవితి అయిన మరుసటి రోజు రమేష్ చనిపోయినట్టు తెలిసిందట. చనిపోయేముందు రమేష్ కూడా విజయేంద్ర ప్రసాద్‌ని ఒక్కసారి చూడాలని తహతహలాడిపోయాడట.
ఒకేసారి ఇద్దరూ ఒకర్ని ఒకరు గుర్తుచేసుకొన్నామన్న విషయం విజయేంద్ర ప్రసాద్‌ని ఆలోచనలో పడేసిందట. ఎక్కడో ఉన్న ఓ వ్యక్తి ఆలోచనా తరంగాలు.. ఎక్కడో ఉన్న మరో వ్యక్తి కి చేరతాయన్న విషయం తన స్పీయానుభవం వల్ల తెలిసిందంటున్నారు విజయేంద్ర ప్రసాద్. ”ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే.. ఇక్కడెందుకు మోగుతుంది. ఎక్కడి నుంచే వస్తున్న ధ్వని తరంగాల్ని రేడియో ఎలా ప్రసారం చేస్తోంది? ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనిషి ఆలోచనల్ని కూడా చదవొచ్చు కదా? ఈ ఆలోచన నుంచే ‘శ్రీవల్లీ’ కథ పుట్టింది” అన్నారు విజయేంద్ర ప్రసాద్.