‘మగధీర’ తరవాత మెగా ఫ్యామిలీకి – రాజమౌళికీ మధ్య దూరం పెరిగింది. సోషల్ మీడియా కూడా చాలాసార్లు ఈవిషయాన్ని హైలెట్ చేసింది. ‘మగధీర సినిమా నా వల్లేహిట్ అయ్యిందంటే నా వల్లే అయ్యిందని’ దర్శకుడు, కథానాయకుడు తలోమాట అనుకొన్నారని, అందుకే రాజమౌళి వెంటనే `ఈగ`తో సినిమా చేసి హిట్టు కొట్టాడని రకరకాల కథనాలు వచ్చాయి. ఈ విషయం రాజమౌళి వరకూ వెళ్లింది. రాజమౌళి ఈ కామెంట్లని లైట్ తీసుకొన్నాడు. అయితే.. రాజమౌళికీ మెగా ఫ్యామిలీకి సఖ్యత లేదన్న అపవాదు పక్కన పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. అల్లు అరవింద్‌తో తనకు ఒకట్రెండు విషయాల్లో విబేధాలు తలెత్తాయని ఒప్పుకొన్నాడు కూడా.
అయితే.. ఇప్పుడిప్పుడే ఈ రెండు కుటుంబాల మధ్య దూరం దగ్గరవుతున్నట్టు అనిపిస్తోంది. ‘ఖైది నెం.150’ తరవాత రాజమౌళి మెగా పేరు పలవరించడం మొదలెట్టాడు. బాహుబలి ని అటు చిరంజీవి, ఇటు చరణ్ ఆకాశానికి ఎత్తేశారు. సైరా చిత్రాన్ని రాజమౌళి సమక్షంలో శ్రీకారం చుట్టాడు చిరు. ఇప్పుడు ‘శ్రీవల్లీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చరణ్ గెస్ట్‌గా వెళ్లాడు. అక్కడే `మగధీర 2` ప్రస్తావన వచ్చింది. ‘మగధీర 2’ తీసినా తీయకపోయినా.. చిరు ఫ్యామిలీతో రాజమౌళి ఓ సినిమా చేయడం దాదాపుగా ఖాయమైపోయిందన్నది టాలీవుడ్ వర్గాల టాక్. రాజమౌళి లాంటి దర్శకుడ్ని ఏ కథానాయకుడూ వదులుకోడు. చిరంజీవి స్టార్ డమ్ ని ఏ దర్శకుడూ కాదనలేడు. అందుకే.. వీళ్ల మధ్య వచ్చిన గ్యాప్.. మెల్లమెల్లగా సర్దుకుపోయినట్టు అనిపిస్తోంది. అతి తొందరలో మెగా ఫ్యామిలీతో రాజమౌళి ఓ సినిమా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు.