జైలవకుశ… ఈ టైటిల్‌ని మళ్లీ ఎంచుకోవడమే అత్యంత సాహసం. ఆ సాహసం చేశాడు ఎన్టీఆర్. అక్కడితో ఆగలేదు. మూడు పాత్రలు చేశాడు. అంతటితో సరిపెట్టుకోలేదు. అందులో ఒకటి విలన్. ఇంకా సంతృప్తి పడలేదు.. నత్తి.. నత్తిగా డైలాగులు చెప్పడం మొదలెట్టాడు. ఓ విధంగా.. ఎన్టీఆర్ తన కెరీర్లో చేస్తున్న అత్యంత సాహసోపేతమైన సినిమా ఇదే కావొచ్చు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి మాట్లాడాలి. అంచనాలేమాత్రం పెరగినా దాన్ని అందుకోవడం చాలా కష్టం. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాని ఓ రేంజులో ఊహిస్తున్నారు. వాళ్ల అంచనాలకు దగ్గరగా ఈ సినిమాని తీసుకెళ్లడం తలకు మించిన పని. దాన్ని కంట్రోల్ చేయడం పక్కనుంచి.. ఆ అంచనాల భారం మరింత పెంచేలా మాట్లాడేశాడు కల్యాణ్ రామ్.
జై లవకుశ ట్రైలర్ విడుదలలో కల్యాణ్‌రామ్ స్పీచ్ అందరినీ ఆకట్టుకొంది. మరీ ముఖ్యంగా నందమూరి అభిమానుల్ని. తమ్ముడిపై తనకున్న ప్రేమ అక్షరాలా చాటుకొన్నాడు. ఈ సినిమాపై నమ్మకాన్ని మాటల్లో వ్యక్తపరిచాడు. అంత వరకూ బాగానే ఉంది. కాకపోతే ఈ సినిమాని అప్పటి దానవీర శూరకర్ణతో పోల్చాడు కల్యాణ్ రామ్. తాతయ్య సినిమా కాబట్టి, ఇందులోనూ మూడు పాత్రలు ఉన్నాయి కాబట్టి అలా పోల్చి చూసే హక్కు నందమూరి వారసుడిగా కల్యాణ్ రామ్‌కి ఉండొచ్చు గాక. ఓ నిర్మాతగా ఈ సినిమాని ఆ రేంజులో ఊహించుకోవడం కూడా తప్పేం కాదు. కానీ.. అభిమానుల అంచనాల్ని ఇలాంటి పోలికలు మరింత పెంచేస్తాయన్న విషయాన్ని కల్యాణ్ రామ్ గుర్తుంచుకోవాలి. ఇదేం పౌరాణిక చిత్రం కాదు. మామూలు కమర్షియల్ కథ. మూడు పాత్రలూ ఆ కమర్షియల్ కోణానికి తగ్గట్టుగానే ఉంటాయి. మూడు పాత్రల్లో జైకే అగ్రతాంబూలం అన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఓ కమర్షియల్ సినిమా తీసినప్పుడు దాన్ని క్లాసిక్ అనదగ్గ సినిమాతో పోల్చడం సాహసమే. దాన వీర శూర కర్ణని ఊహించుకొంటూ థియేటర్లలోకి జనం థియేటర్లలోకి అడుగుపెడతారని చెప్పలేం గానీ, సినిమా ఏమాత్రం అటూ ఇటూ అయినా… ఈ పోలికలపై సెటర్లు మొదలైపోతాయి. సినిమా విడుదలై, సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు ఎన్ని మాటలు చెప్పినా చెల్లుబాటు అవుతాయి. విడుదలకు ముందు కాస్త నిదానం అవసరం. కాదంటారా??