తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇంటింటికీ తెలుగుదేశం. దీన్ని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని తెట్టంగి గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆయనే స్వయంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగారు. గడచిన మూడేళ్లలో తెలుగుదేశం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెబుతూనే, వాటి ఫలాలు ప్రజలకు అందాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశంపై సామాన్య ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి సూచించారు.
సంక్షేమ పథకాల అమలు అనేది పార్టీలకి అతీతంగా జరుగుతోందనీ, అందరినీ సమానంగా చూసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందనీ, వార్ వన్ సైడ్ చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓపక్క తాము అభివృద్ధి చేస్తుంటే, కొంతమంది దానికి అడుగడుగునా అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారంటూ వైకాపాను ఉద్దేశించి విమర్శించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు కొంతమంది చూస్తున్నారనీ, అలాంటి మాయల్లో పడొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక, గ్రామాల మధ్య ఐకమత్యం తీసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చంద్రబాబు చెప్పారు. 2019 టార్గెట్ ఏంటంటే… రాష్ట్రంలోని 175 నియోజక వర్గాలకుగానీ, 175 చోట్లా తెలుగుదేశం గెలవాలని సీఎం పిలుపునిచ్చారు. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం ద్వారా, వారికి మరింత చేరువ కావాలని సీఎం పార్టీ కేడర్ కి సూచించారు.
మొత్తానికి, ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రధాన లక్ష్యం వచ్చే ఎన్నికల్లో గెలుపు! అంటే, ఇదో పార్టీ ప్రచార కార్యక్రమం అని కూడా చెప్పొచ్చు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనతగా ప్రచారం చేసుకుంటారు! నిజానికి, ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏవైనా సరేసరే.. వీటికి టీడీపీ పార్టీ ఫండ్ నుంచి సొమ్ము తియ్యడం లేదు కదా! అలాంటప్పుడు, టీడీపీ ఘనతగా ఎలా చెప్పుకుంటారూ అంటే… ప్రజలకు అలా చెప్పడం ఎప్పట్నుంచో అలవాటు చేసేశారు. ఆ సన్నని గీత ఎప్పుడో చెరిగిపోయింది. ఇప్పుడు 50 రోజులపాటు సాగే ఈ ఇంటింటి కార్యక్రమ నిర్వహణకు కూడా భారీ ఎత్తున ఖర్చు అవుతుంది. ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాదే కదా! కానీ, దీన్ని కూడా పార్టీ కార్యక్రమంగానే నిర్వహిస్తారు! అధికారంలో ఉంటూ ఏ చిన్న పనిచేసినా.. ఆ ఘనత అంతా అధికారంలో ఉన్న పార్టీదే అన్నమాట! పార్టీకి ప్రచారం కల్పించాలన్నా అధికారం ఉంది కాబట్టి, ప్రభుత్వ పథకాల ప్రచారం పేరుతో ఖర్చు చెసెయ్యొచ్చన్నమాట! నిజానికి, ఇప్పటికి కూడా పథకాలు అందనివారిని గుర్తించడమే ఈ కార్యక్రమ ధ్యేయం అనుకుంటే… ఇంత పెద్ద ఎత్తున ఖర్చు ఎందుకు? మండల స్థాయి ప్రభుత్వాధికారులకు ఆదేశాలు జారీ చేస్తే అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారు కాదా చెప్పండీ..!