అపారమైన ఆర్థిక వనరులూ పలుకుబడి వుండికూడా కేంద్రంలో ప్రతిపక్ష ఎంపిలుగా ఏ పాత్ర లేకుండా వుండిపోవడం కొందరు టిఆర్ఎస్ మోతుబరులకు కష్టంగా వుందని గతంలో చెప్పుకున్నాం. ఈ కారణంగానే ఆరుగురు టిఆర్ఎస్ ఎంపిలు రాజీనామా చేసి బిజెపిలో చేరవచ్చని కథనాలు వినిపిస్తున్నట్టు ఆగష్టు4న తెలుగు360లో రాసిన వార్తను సోషల్‌మీడియాలో చాలా మంది కాపీ చేశారు. రానురాను రాజకీయ గమనం చూస్తుంటే ఆ కథనాలు నిజమయ్యేట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి బాగా ఆలస్యంగా టిఆర్ఎస్లో చేరిన ఎంపి సుఖేందర్‌రెడ్డి త్వరలో పదవికి రాజీనామా చేయనున్నట్టు ఈ రోజు ఒక్కసారిగా అన్ని ఛానల్స్‌లోనూ ఒకటే వార్త ప్రసారమైంది. సుఖేందర్ పార్టీ మారినప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే అధినేత కెసిఆర్ అంతిమ నిర్ణయానికి కట్టుబడి వుంటానని కూడా చెప్పారు. సుఖేందర్‌రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం వుందని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. ఆ హామీపైనే ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పారు. అయితే అది జరగలేదు. అసలు కెసిఆర్ మంత్రివర్గంలో మార్పులే దాదాపు లేవు. మరి ఈ పరిస్థితిలో ఎంపి స్థానానికి రాజీనామా చేసి ఎంఎల్‌సిగా మంత్రి అవుతారా? లేక కొందరు చెబుతున్నట్టు మళ్లీ మాతృసంస్థ కాంగ్రెస్‌లోకి వెళతారా? చెప్పవలసింది ఆయనే మరి!