‘పైసా వసూల్’ సినిమాకి విడుదలకు ముందు వచ్చిన బజ్ అంతా ఇంతా కాదు. పూరి – బాలయ్య కాంబో అనగానే కొత్తగా అనిపించింది. దానికి తోడు ఈ సినిమా నిండా స్పెషలాఫ్ ఎట్రాక్షన్సే. బాలయ్య పాట పాడడం, నాన్నగారిలా స్పెప్పులు వేయడం… కచ్చితంగా ఆకర్షించే అంశాలు. దానికి తోడు స్టంపర్ అదిరిపోయింది. ఇన్ని ఉండి కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రాలేదు. రూ.40 కోట్ల వరకూ మార్కెట్ అయితే.. అందులో సగమే వసూల్ అయ్యింది. ఊహించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడానికి బాలయ్య వైఖరే కారణమన్న టాక్ వినిపిస్తోంది. నంధ్యాల ఎన్నికల పర్వంలో అభిమానిపై చేయి చేసుకొన్నాడు బాలయ్య. దాన్ని ఫ్యాన్స్ లైట్ తీసుకొన్నా.. దాని తరవాత జరిగిన పరిణామాలు మాత్రం వాళ్లని బాగా హర్ట్ చేశాయని సమాచారం. ‘నేను కొడితే… ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు’ అని పదే పదే చెప్పడం, పూరి కూడా.. బాలయ్య చెంపదెబ్బ ముద్దుతో సమానం అన్నట్టు మాట్లాడడం ఫ్యాన్స్‌కి నచ్చలేదని తెలుస్తోంది.
ఆ విషయాన్ని వదిలేయాల్సింది పోయి.. పదే పదే గుర్తు చేయడం కూడా బాధించి ఉండొచ్చని తెలుస్తోంది. అందుకే చాలామంది ఫ్యాన్స్ ఈ సినిమాని కావాలనే బాయ్ కాట్ చేశార్ట. `ఈ సినిమా మేం చూడం… మీరూ చూడొద్దు` అంటూ చాలామంది బాలయ్య ఫ్యాన్స్‌కు మెసేజీలు అందాయని సమాచారం. బాలయ్య అభిమానుల్ని సంతృప్తి పరిచేలా సినిమా తీశాం.. అని చెప్పుకొంటున్న చిత్రబృందం… వాళ్లని ఈ విధంగా హర్ట్ చేయడంతో – ఆ ప్రభావం వసూళ్లపై చూపించిందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఎంత ఫ్యాన్స్ అయినా… వాళ్లకీ వ్యక్తిత్వం ఉంటుంది. అభిమాన హీరోలకు జై కొట్టడానికి పుట్టామంటే గర్వపడతారు తప్ప… వాళ్లతో కొట్టించుకోవడానికి కాదు. ఈ విషయాన్ని బాలయ్యే కాదు… స్టార్ హీరోలంతా గుర్తించాలి.