రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక జరిపించి, ఆ గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నంద్యాల తరహాలోనే రాష్ట్రంలో ఏదో ఒక స్థానానికి దసరా తరువాత ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగానే చర్చ జరుగుతోంది. నల్గొండ లోక్ సభ స్థానానికే ఎలక్షన్ ఉండొచ్చని అంటున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి, వెంటనే ఉప ఎన్నిక నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే, ఇదే అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకునే కసరత్తు మొదలుపెట్టారనే చర్చ మొదలుకావడం విశేషం.
నల్గొండ ఉప ఎన్నికల్లో తెరాస గెలిస్తే కాంగ్రెస్, టీడీపీలకు ఇబ్బందికరమైన పరిస్థితే వస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఒక్క గెలుపును తెరాస భారీగా ప్రచారం చేసుకుంటుంది. అందుకే, ఆ పార్టీలు కూడా అభ్యర్థులను బరిలోకి దింపాల్సిన పరిస్థితి అనివార్యం అవుతుంది. అలాగని ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా తెరాసను ఎదుర్కొనే పరిస్థితీ ఉండదు. టీడీపీతో భాజపా కలిసి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. పోనీ, కేసీఆర్ ఎదుర్కోవడంలో భాగంగా కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు ఇస్తుందా అంటే.. ప్రస్తుత పరిస్థితిలో అదీ సరైన వ్యూహం కాదు. ఎందుకంటే, ఈ ఉప ఎన్నిక ప్రభావం 2019 జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుంది కాబట్టి. అందుకే, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే నల్గొండ లోక్ సభ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున రేవంత్ రెడ్డి స్వయంగా పోటీకి దిగడమే సరైన వ్యూహం అనే అభిప్రాయం వ్యక్తం కావడం విశేషం!
రేవంత్ స్వయంగా పోటీకి దిగడం ద్వారా ఆయన సొంత ఇమేజ్ తోపాటు, ఇక్కడి సామాజిక సమీకరణలు కూడా టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ అంచనా. వ్యక్తిగతంగా కూడా రేవంత్ కి ఇది మంచి అవకాశమే అవుతుందనీ తమ్ముళ్లు లెక్కలేస్తున్నట్టు సమాచారం. సర్వశక్తులూ ఒడ్డి, ఈ ఒక్క ఎన్నికలో టీడీపీ గెలిస్తే చాలనీ, 2019 ఎన్నికల్లో పార్టీ కేడర్ కు కావాల్సిన ఉత్సాహం వచ్చేస్తుందని భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను కేసీఆర్ కూడా అంత ఈజీగా వదలరు కదా. ఆయన తాజా సర్వే ప్రకారం నల్గొండల లోక్ సభ స్థానంలో తెరాసకు 52 శాతం అనుకూలంగా ఉన్నారట. తరువాతి స్థానంలో కాంగ్రెస్ ఉందనీ అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే మాత్రం పోటీ ఆసక్తికరంగా మారుతుందని కచ్చితంగా చెప్పొచ్చు. మొత్తానికి, నల్గొండ స్థానం ఖాళీ అయితే, ఆ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడం ఖాయంగానే కనిపిస్తోంది.