తెలంగాణలో భాజపాతో కలిసి సాగాలా వద్దా.. ఇదే ప్రశ్న టీటీడీపీ వర్గాల్లో ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగానే ఉంటుంది. తెగతెంపులు చేసేద్దాం అని టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు అంటూ ఉన్నా… ఇంకా సమయం ఉంది అంటూ అధినేత చంద్రబాబు నాయుడు వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అమిత్ షాతో మాట్లాడాలి, ఆ తరువాతే ఒక స్పష్టతకు వద్దామంటూ రాష్ట్ర నేతలకు చెబుతూ వస్తున్నారు. కానీ, రాష్ట్రనేతలు మాత్రం ఏదో ఒక స్పష్టత కావాలంటూ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇంకోపక్క, భాజపా రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు పావులు కదుపుతూ ఉంది. వచ్చే ఎన్నికల నాటికి కీలక రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీ కార్యకలాపాలను రాష్ట్రంలో పెంచుతోంది. ఈ నేపథ్యంలో పొత్తు విషయమై స్పష్టత కోసం మరోసారి టీడీపీలో చర్చ జరిగింది. అయితే, ఈసారి అధినేత చంద్రబాబు ఆదేశం కోసం ఎదురుచూడకుండానే… భాజపాతో సంబంధం లేకుండానే తమ కార్యకలాపాలు సిద్ధం చేసుకోవాలంటూ కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
పొత్తు విషయమై రేవంత్ రెడ్డి తాజాగా ఒక స్పష్టత ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లోగానీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోగానీ, జీఎస్టీ బిల్లు విషయంలోగానీ, పెద్ద నోట్ల రద్దు సమయంలోగానీ.. ఇలా కేంద్రం తీసుకునే నిర్ణయాలకు సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చారన్నారు. ఆయన మద్దతు ఇచ్చారు కాబట్టి, కేసీఆర్ ను విమర్శించేందుకు భాజపాకి ఏదైనా అభిమానం అడ్డు రావొచ్చన్నారు. లేదంటే, కేసీఆర్ అంటే వారికి ప్రత్యేకమైన ప్రేమ ఉండొచ్చన్నారు. భాజపా అనుకూలంగా వ్యవహరిస్తున్నంత మాత్రాన, భాగస్వామ్యులమైన మాది కూడా అదే వైఖరి అనుకోవద్దన్నారు. కేసీఆర్ విధానాలను వ్యతిరేకించడంలో తెలుగుదేశంలో ఎప్పుడూ ముందుంటుందనీ, కేసీఆర్ కు దగ్గరయ్యేవారికి తాము దూరం జరుగుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ ను వ్యతిరేకించేవారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తామన్నారు.
భారతీయ జనతా పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని మొదట్నుంచీ చెబుతున్నాం అంటూ ఆ పార్టీ నాయకుడు లక్ష్మణ్ అంటున్నారు. రాష్ట్రంలో సొంతంగా ఎదగాలనే చూస్తున్నాం, తెలంగాణలో ఎవ్వరితోనూ కలిసేది లేదని ఆయన స్పష్టం చేశారు. పొత్తు విషయంలో టీడీపీ, భాజపాలు స్పష్టంగానే ఉన్నాయి. కేసీఆర్ ను మెచ్చుకునేవారికి తాము దూరంగా ఉంటామని రేవంత్ అంటుంటే, ఎవ్వరితోనూ పొత్తు ఉండదని భాజపా నేతలు చెబుతున్నారు. సో.. తెలంగాణ టీడీపీ నేతలు ఒక స్పష్టతకు వచ్చేశారనే అనిపిస్తోంది. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు మాట ఏంటనేదే ఇంకా తేలాల్సి ఉంది. పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చినా కూడా… ఇంకా అమిత్ షాతో మాట్లాడాలీ, తొందరపడి విమర్శలు చెయ్యొద్దని వెనకేసుకుని వస్తే అది మరో సమస్యగా మారొచ్చు. అందుకే, కనీసం ఇప్పటికైనా అధినేత స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ టీ తమ్ముళ్ల నుంచి వినిపిస్తోందిప్పుడు!