అదిగో సినిమా అంటే, ఇదిగో రేటు అన్నట్లు తయారైంది వెబ్ వార్తల వ్యవహారం. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమాను నైజాం కు 29 కోట్లకు కొనేసారంటూ ఓ వార్త గుప్పుమంది. వెబ్ సైట్లు పట్టుకుని, పెట్టేసుకున్నాయి. నిజానికి ఇవే వెబ్ సైట్లు కొన్నాళ్ల క్రితం ముఫై కోట్లకు పైగా అని రాసిన సంగతి కూడా వుంది. ఇది తాజా ఫిగర్ అన్నమాట.
అసలు 29 కోట్లు నైజాంలో రావాలంటే త్రివిక్రమ్-పవన్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా బ్లాక్ బస్టర్ అయితే వచ్చే కలెక్షన్లు ఓ రేంజ్ లోనే వుంటాయి. ఇక్కడ బాహుబలి లెక్కలను పక్కకు పెట్టండి. ఫిదా లాంటి మీడియం సినిమా బ్లాక్ బస్టర్ అయింది, యాభై రోజులు దాటినా నైజాంలో ఇంకా యాభై సెంటర్లలో ఆడుతోంది. అయినా వచ్చింది ఇరవై కోట్లకు కాస్త దగ్గరగా. ఎన్టీఆర్ లవకుశ రేటు కూడా ఇరవై కోట్లకు లోపే. మహేష్ స్పైడర్ వ్యవహారం బయటకు అమ్మకంగా, లొపల అడ్వాన్స్ గా వుంది.
మరి అలాంటిది త్రివిక్రమ్-పవన్ సినిమాకు ఎవరిస్తారు? 29 కోట్లు? వాస్తవం ఏమిటంటే, ఆ సినిమాకు దిల్ రాజు పెట్టిన రేటు 23.5 కోట్లు అని తెలుస్తోంది. అయితే నైజాం రేషియో చూపించి, మిగిలిన ఏరియాలు అమ్మడం కోసం ఈ ఫీలరు పుట్టించినట్లు తెలుస్తోంది.